తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రా చుట్టూనే రాజకీయాలు సాగుతున్నాయి. ప్రజాక్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ వైఖరి మాత్రం చర్చకు దారి తీస్తోంది. గతంలో బీఆర్ఎస్ ఎత్తుకొని వదిలేసిన అంశాన్ని బీజేపీ  భుజాన వేసుకుంది.


రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో ఇప్పుడు హైడ్రా మీదనే పంచాయితీ కొనసాగుతోంది. కానీ ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవడంలో బీజేపీ మాత్రం ఫెయిల్ అయిందనే పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఒకే దఫాలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. దానిపై వరంగల్ సభా వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించింది. అంత వరకు బాగానే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల తర్వాత రుణమాఫీకి అధికార పార్టీ సిద్ధమైంది.


చెప్పినట్లుగానే లక్ష, లక్షన్నర, రెండు లక్షల రుణాలను మఫీ చేసింది. కానీ అందులోను లొసుగులను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. రుణమాఫీ అందరికీ జరగలేదని.. చాలా మంది రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కి సైతం లేఖలు రాశారు. ఒక విధంగా చెప్పాలంటే రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ఆగమాగం చేశారు.


ఇప్పుడు హైడ్రా మీద నిరసనలు మొదలయ్యాయి. బాధితులంతా వరసుగా బీఆర్ఎస్ కార్యాలయానికి క్యూ కట్టారు. దీంతో హైడ్రా విషయంపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతోంది. బీఆర్ఎస్ వైఖరి ఇలా ఉంటే.. బీజేపీ మాత్రం రివర్స్ లో వెళ్తోంది. పాత చింతకాయ పచ్చడిలా ఇప్పుడు రుణమాఫీ అంశాన్ని భుజాన వేసుకుంది. దీంతో పార్టీలోని సీనియర్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా హైడ్రా సమస్య కొనసాగుతుంటే ఆ సమయంలో రుణమాఫీ గురించి దీక్షలు చేయడమేంటని.. ఇలా చేస్తే ఎవరు పట్టించుకుంటారు అని పలువురు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: