ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొత్త వివాదం సంచలనం రేపుతోంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బడా గణేష్, పురుషోత్తమ, తదితర దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం జరిగింది. మంగళవారం రాత్రికి రాత్రే 10 మందిరాల్లో బాబా విగ్రహాలు మాయమయ్యాయి. 'సనాతన్‌ రక్షక్‌ దళ్‌' చేపట్టిన ప్రచారంలో భాగంగా బాబా విగ్రహాలను తొలగించినట్లుగా చెబుతున్నారు.

సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు సోమవారం లోహటియాలోని బడా గణేష్ ఆలయంలో సమావేశమై సాయిబాబా విగ్రహాలను తొలగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే వీళ్లు వినాయకుడి ఆలయంలోని సాయిబాబా విగ్రహాన్ని తీసేసి ప్రాంగణం వెలుపల పెట్టారు. సరైన నాలెడ్జ్ లేకుండానే సాయిబాబాను దేవుడిలాగా కొలుస్తున్నామని, శాస్త్రాల్లో బాబాను పూజించమని ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవని సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. ఇదిలా ఉండగా అయోధ్యలోని హనుమాన్‌ గఢీ ఆలయ మహంతు రాజుదాస్‌ కూడా వాళ్లు చేసిన పనిలో తప్పేం లేదు అని అన్నారు. సాయిబాబా ధర్మ గురువే అయినా, దేవుడు కాదు అని ఆయన కామెంట్స్ చేశారు.

కాశీలో శివుడు మాత్రమే పూజలు అందుకోవాలని దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ శర్మ తెలిపారు. వారణాసిలోని సంత్‌ రఘువర్‌ దాస్‌ నగర్‌లో బాబా వెలశారు. ఆ ఆలయ పూజారి సమర్‌ ఘోష్‌ కూడా ఈ వ్యవహారం పై రియాక్ట్ అయ్యారు. ''ఈరోజు సనాతన ధర్మ రక్షకులం అని చెప్పుకుంటున్న వాళ్లే ఒకప్పుడు ఈ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు వాటిని తొలగించడం సరైన చర్య కాదు'' అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ చర్యల వెనుక బీజేపీ హస్తం ఉందని యూపీలోని విపక్ష పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. బాబాను భగవంతుడి అవతారంగా భావిస్తూ ప్రతి మతం వారు పూజిస్తారని శిర్డీ శ్రీ సాయిబాబా సనాతన్‌ ట్రస్టు వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మరోవైపు ద్వారకాపీఠం శంకరాచార్య సాయిబాబాను పూజించడం పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని 2014లో కన్నెర్ర చేసింది. ఈ ఏడాది జూన్‌లో మద్రాసు హైకోర్టు తమిళనాడు హిందూ మతం, ధర్మాదాయ శాఖకు నోటీసులు పంపింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఇది స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: