ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడకుండా వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టుగా గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తాడేపల్లి లో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సిక్స్ లేదు.. సెవెన్ లేదు.. చంద్రబాబు మోసాల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చంద్రబాబు చేస్తున్న అన్ని మోసాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి.

స్కూల్స్ పోయాయి.. చదువులు పోయాయి.. ఆరోగ్యశ్రీ, డోర్ డెలివరీ, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి, రైతు భరోసా ఇలా ఒక్కటేమిటి మొత్తం పోయాయి అంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా అన్ని అంశాలలో కూడా కూటమి ప్రభుత్వం కుప్పకూలిందని , విద్యా , వైద్య,  వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోకేష్ రెడ్  బుక్ పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా కనిపించడం లేదు.. అసలు పారదర్శకత అనేది లేదు. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు నచ్చిన వారికి మాత్రమే వరద సహాయం అందిస్తున్నారు.

పరిపాలన ఇంత ఘోరంగా ఉంది .ముఖ్యంగా ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త అంశాలు తెరపైకి తెస్తున్నారు. అందులో ఒకటి లడ్డు కల్తీ వివాదం. సుప్రీంకోర్టు బాగా గడ్డి పెట్టింది. వీళ్ళు చేసిన పనులతో దేవుడికి కూడా ఆగ్రహం వస్తోంది అంటూ జగన్ పేర్కొన్నారు.

పార్టీ బాగుంటేనే మనం అంతా బాగుంటాము. పార్టీలో కష్టపడి పని చేసే వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. కేవలం నేను మీ అందరి ప్రతినిధిని మాత్రమే. పార్టీ మన అందరిదీ అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. నష్టపోయిన వారికి అండగా నిలబడడం,  పార్టీకి లక్షల మంది కార్యకర్తలు,  కోట్ల మంది అభిమానులు ఉన్నారు. వారంతా కూడా పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని,  మిమ్మల్ని కోరుతున్నాను అంటూ మాజీ సీఎం కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: