తిరువూరు తెలుగుదేశం పార్టీలో నెలకొన్న పంచాయితీ ఎట్టకేల‌కు ఎన్టీఆర్ భవ‌న్‌కు చేరింది. వరుస ఫిర్యాదులతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పిలిపించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, పార్టీ సీనియర్ నేత వ‌ర్ల రామయ్య, సత్యనారాయణ రాజు తదితరులు కొలికపూడితో మాట్లాడారు. తిరువూరులో జరిగిన పరిణామాలపై వారు వివరణ కోరారు. ఈ క్రమంలోని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నా పనితీరు వల్ల‌ క్యాడర్లో సమన్వయ లోపం ఏర్పడింది. సమస్యలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. నావల్ల కొందరికి ఇబ్బందులు వస్తాయని ఊహించలేదు. నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో ఆదివారం ఇరువురిలో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తానని, నా వల్ల తలెత్తిన ఇబ్బందులను సరి చేసుకుంటానని.. పార్టీ పెద్దలకు శ్రీనివాసరావు చెప్పినట్టు సమాచారం.


ఎమ్మెల్యే పై ఇటివల ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరువూరు నియోజకవర్గ మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులను కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని.. అలాగే కొలిక‌పూడి బెదిరించారంటూ కూడా కొన్ని ఆధారాలను చంద్రబాబుకు అందజేశారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని వారు చంద్రబాబును కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసు అన్న చంద్రబాబు.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మహిళా ఉద్యోగుల వాట్సాప్‌లకు మెసేజ్లు పెడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు వెర్ష‌న్‌ మరోలా ఉంది.


ఎమ్మెల్యే చేస్తున్న గ్రావెల్, ఇసుక, మట్టి, బియ్యం అక్రమ దందాకు తాము ఎక్కడ అడ్డుప‌డ‌తామ‌న్న భావనతో తమను టార్గెట్ చేస్తున్నారని.. తాము 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్నామని.. కనీసం పార్టీ సభ్యత్వం లేకుండా ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీటు ఇచ్చి తిరువూరు పంపిస్తే.. భారీ మెజార్టీతో గెలిపించామని.. వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తిరువూరు తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎన్టీఆర్ భవన్‌కు చేరింది. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం కొలిక‌పూడిని పార్టీ కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది. ముందు దూకుడుగా వెళ్లిన కొలికపూడి పార్టీ పెద్దలు అలా చేయటం సరికాదు అని చెప్పడంతో కాస్త వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: