సాధారణంగా మద్యం వ్యాపారం అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. దానికి ప్రత్యేకంగా వ్యాపారులు ఉండేవారు. ఒకవేళ సామాన్యులు మద్యం వ్యాపారం వైపు చూస్తే ముందుగా కుటుంబం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. వారు వీరు అనే తేడా లేకుండా అందరూ ధనార్జన ధ్యేయంగా మద్యం వ్యాపారం వైపు అన్ని రంగాల వారు అడుగులు వేస్తున్నారు.


ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభం అయిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 9 వరకు కొనసాగనుంది. 11న షాపులకు లాటరీలు తీయనున్నారు. 12 నుంచి కొత్త మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. అయితే దరఖాస్తులకు సంబంధించి తొలి మూడు రోజులు అంతంతమాత్రంగానే దాఖలు అయ్యాయి.


అమావస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు గడువు ముగుస్తున్న కొలదీ.. దరఖాస్తులు సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. అధికారుల మైండ్ బ్లాంక్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రిఫండబుల్ కావడంతో ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే దరఖాస్తులు నమోదు అవుతున్నాయి.


అయితే ఇప్పుడు అనుభవం లేని వారు సైతం ఈ వ్యాపారంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మద్యం దుకాణాలను సీఎం చంద్రబాబు రద్దు  చేశారు. టెండర్ల ద్వారా ప్రైవేట్ మద్యం పాలసీని ప్రవేశ పెట్టారు. దీంతో ఈ సారి ఎన్నడూ లేని విధంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం మద్యం షాపులను దక్కించుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ జాబితాలో వైద్యులు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు సైతం ఉన్నారు. అయితే ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అటు వ్యాపారంతో పాటు ఉద్యోగం చేసుకోవచ్చు అనేది వారి ఆలోచనగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn