అపన్న ప్రసన్నుండు.. మన మోదీ అంటూ ఇటీవల జరిగిన హరియాణా ఎన్నికల్లో బీజేపీ నేతలు ఆయన్ను ఆకాశం నుంచి అంతరిక్షం వరకు మోసేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మోదీని మించిన నాయకుడు లేదన్నది కమల నాథుల మాట. సరే.. ఏపీ విషయానికొస్తే మాత్రం.. ఆ ఆపన్న హస్తం ఏమైందన్న ప్రశ్న ఉత్ప్నన్నం అవుతుంది.


ఇక్కడ విజయవాడ సహా కాకినాడ, ఏలూరు, బాపట్ల జిల్లాలు వరద నీటిలో చిక్కుకొని నానా తిప్పలు పడిన సంగతి తెలిసిందే. దీంతో సుమారు 90 వేల కుటుంబాలు 4 లక్షలకు పైగా జనాలను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపైనా.. కూటమి సర్కారుపైన పడింది. ఈ క్రమంలోనే రూ.6880 కోట్లు కావాలని ప్రాథమిక అంచనా రూపొందించి.. సాయం కావాలంటూ చంద్రబాబుక కేంద్రానికి నివేదిక పంపించారు. కేంద్ర బృందానికి కూడా పూస గుచ్చినట్లు వివరించారు. ఇదీ నష్టం.. ఆదుకోకపోతే కష్టం అంటూ ఆయన కరాఖండిగా చెప్పేవారు.


పైగా ఇక్కడ అక్కడా కూడా.. బీజేపీ కూటమిలో ఉన్న నేపథ్యంలో తనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది. ఇప్పట్లో ఎన్నికలు లేనందున అసలు అవసరం లేనందున కేంద్రంలోని మోదీ సర్కారు ఎత్తుగడ వేసింది. అడిగింది రూ.6880 కోట్లు అయితే.. రూ.1430 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది.


ఇక పెద్దగా నష్టపోని మహారాష్ట్రకు మాత్రం నిధుల వరద పారించింది. దీనికి కారణం అక్కడ ఎన్నికలు ఉండటమే. వాటిలో విజయం దక్కించుకోవాలంటే భారీ ఆర్థిక సాయం చేయక తప్పదు. ఇదీ బీజేపీ ఎత్తుగడ. ఏపీలో జరిగిన నష్టంతాలూకూ కష్టం ఎవరికీ అంటే సీఎం చంద్రబాబుకే. ఎందుకంటే బీజేపీ స్వయం ప్రకాశితమేమీ కాదు. చంద్రబాబు వెలుగులో విరాజిల్లుతోంది.ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. బుడమేరును పటిష్ఠం చేస్తామని.. పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పిన మంత్రులు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీనికి కారణం నిధులు లేకపోవడమే. కేంద్రం నుంచి వేల కోట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి మోదీ పెద్ద షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: