సిమి తన ఎక్స్ అకౌంట్‌లో రతన్ టాటా గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె తన షో 'రెండెజ్‌వుస్ విత్ సిమీ గరేవాల్'లో రతన్ టాటాతో కలిసి తీసుకున్న ఫోటోల కలెక్షన్‌ను పంచుకున్నారు. ఈ ఫోటోలతో పాటు, ఆమె "మీరు వెళ్లిపోయారని వారు చెబుతున్నారు. మిమ్మల్ని కోల్పోవడం భరించలేకపోతున్నాను... చాలా కష్టంగా ఉంది... నా స్నేహితుడా, విశ్రాంతి తీసుకో... #RatanTata" అని రాశారు.
సిమి గతంలో రతన్ టాటాతో తన ప్రేమ సంబంధం గురించి మాట్లాడారు. ఆమె బాలీవుడ్‌లో చురుగ్గా ఉన్న సమయంలో వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే వారు విడిపోయినప్పటికీ, చాలా మంచి స్నేహితులుగా కొనసాగారు. 2011లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇంటర్వ్యూలో సింమీ గరేవాల్, "రతన్, నేను చాలా కాలంగా మంచి స్నేహితులుగా మెలిగాం. ఆయన ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఆయనకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. చాలా మర్యాదపరుడు, వినయంగా ఉంటారు. డబ్బు ఆయన జీవితంలో ప్రధానమైనది కాదు. ఆయన ఇండియాలో కంటే విదేశాల్లో స్వేచ్ఛగా ఉంటారు." అని చెప్పారు.
సిమి గరేవాల్ లూధియానాలో ఒక ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలో జన్మించారు. తన సినీ జీవితాన్ని 1962లో ఒక ఇంగ్లీష్ సినిమాతో ప్రారంభించారు. తర్వాత ఆమె బాలీవుడ్, బెంగాలీ సినిమాల్లో నటించారు. 'దో బదన్', 'మేరా నామ్ జోకర్', 'అరణ్యేర్ దిన్ రతి', 'సిద్ధార్థ', 'కర్జ్' వంటి పెద్ద సినిమాల్లో ఆమె నటించి ప్రేక్షకులను అలరించారు. 90ల దశకం, 2000ల ప్రారంభంలో ఆమె హోస్ట్ చేసిన 'రెండెజ్‌వుస్ విత్ సిమీ గరేవాల్' టాక్ షో ద్వారా కొత్త తరం ప్రేక్షకులు ఆమె గురించి తెలుసుకున్నారు.