దసరా రోజున రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడు అనే రాక్షసుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇలా చేసే ఆచారాన్ని చెడును నాశనం చేసి, మంచిని గెలిపించుకోవడానికి ప్రతీకగా భావిస్తారు. కానీ, కాన్పూర్ ప్రదేశంలో మాత్రం రావణుడికి ఆలయం ఉంది. అక్కడ దసరా రోజు రావణుడిని పూజిస్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో రావణుడికి అంకితమైన ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయం కాన్పూర్‌లోని శివాలా, పటకాపూర్ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం 1868లో మహారాజా గురు ప్రసాద్ నిర్మించారని చెబుతారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తే, ఈ ఆలయంలో మాత్రం దసరా రోజున ఉదయం రావణుడిని పూజిస్తారు.
ఈ ప్రత్యేకమైన రావణుడి ఆలయం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దసరా రోజున తెరుచుకుంటుంది. స్థానికులు రావణుడిని ఒక గొప్ప పండితుడు, అనేక దివ్య శక్తులను కలిగిన వ్యక్తిగా భావిస్తారు. అందుకే ఆయన్ని పూజిస్తారు. వారు రావణుడిని జ్ఞానం, శక్తికి ప్రతీకగా భావిస్తారు. రావణుడు చాలా తెలివైన వాడని, అతని చివరి క్షణాల్లో శ్రీరామచంద్రుడు తన తమ్ముడు లక్ష్మణుడిని రావణుడి నుంచి జ్ఞానం నేర్చుకోవడానికి పంపించాడని కూడా చెబుతారు. రావణుడు ఆడవాళ్ళ విషయంలో నీచుడు కానీ మిగతా అన్ని విషయాల్లో గొప్పవాడు అని మన తెలుగు వారు కూడా చెబుతుంటారు. ఏదేమైనా ఒక్క విషయంలో చెడ్డ వ్యక్తిగా ఉన్నా అతని క్యారెక్టర్ దెబ్బతింటుంది