ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొనగా ఐవీఎఫ్ చేసే విధానాన్ని మంత్రులకు డాక్టర్లు వివరించడం జరిగింది. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ బిల్డింగుల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. "నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది సంతానలేమి సమస్య వల్ల బాధ పడుతున్నారు. అలాంటి వారికి గాంధీలో పూర్తి ఉచితంగా ఐవీఎఫ్ సేవలు ఇకనుండి అందించబడతాయి. గత ప్రభుత్వం పేపర్ల మీద ఫెర్టిలిటీ సెంటర్లను ప్రకటించి, ఆచరణలో నిర్లక్ష్యం చేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు. ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని 2017లో చెప్పి, 2023లో అధికారం కోల్పోయేవరకు కూడా అందుబాటులోకి తీసుకు రాలేదు!" అంటూ మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మరో మంత్రి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో ఉందని, అందుకే ప్రకటించిన నెల రోజుల్లోనే ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ఇక దీనికోసం ఎంబ్రియాలజిస్ట్ సహా అవసరమైన స్టాఫ్‌ను నియమించామని, ఎక్విప్‌మెంట్, రీఏజెంట్స్, మెడిసిన్ కొనుగోలు కోసం నిధులు కేటాయించామని అన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క గాంధీకే ఫెర్టిలిటీ సేవలను పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించామని తెలిపారు. మరో 15 రోజుల్లోనే పేట్లబుర్జు దవాఖానలో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ ఫెర్టిలిటీ సెంటర్లను, ఐవీఎఫ్ సేవలను విస్తరిస్తామని చెప్పుకొచ్చారు.