ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రంగుల కూడా కీలక భూమిక పోషిస్తాయనే సంగతి తెలిసిందే.  ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర రాజకీయాల్లో ఈ రంగులు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్న క్యాంటీన్లకు ఉన్న పసుపు రంగుపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక భాగం అయిన రంగుల వ్యవహారం మరోసారి హైకోర్టుకు ఎక్కింది. 2014-19 సమయంలో కాలువల పక్కన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గర నుంచి కరెంట్ స్తంభాల వరకు పసుపు రంగు వేశారంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ నానాయాగీ చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ  భవనాలు అన్నీ నీలం, ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. దీనిపై అప్పటి ప్రతిపక్షం టీడీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది.


దీనిపై పలువురు కోర్టుని  ఆశ్రయించారు. అప్పట్లో దీనిపై స్పందిచిన న్యాయస్థానం గ్రామ, వార్డు సచివాలయాలకు బ్లూ కలర్ తొలగించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ లను పసుపు రంగు పై హైకోర్టులో పటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ తొలగించాలని ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో స్పందించిన హైకోర్టు.. రంగును బట్టి పార్టీని ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించింది. అన్న క్యాంటీన్లకు గతంలో ఏ రంగులు వేశారని ప్రశ్నించింది.


అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. దీంతో ఏపీ రాజకీయాల్లో రంగుల అంశం మరోసారి చర్చనీయాంశం అయింది.  మరి దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే ఎవరి ప్రభుత్వ హయాంలో వారు తమకు అనుకూలంగా ఉండే రంగులని ఎంపిక చేసుకోవడం కామన్ అని విశ్లేషకులు అంటున్నారు. దీనికి వైసీపీ, టీడీపీ, ఇతర పార్టీలు అతీతమేమీ కాదని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn