జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నికల ముందు వైసీపీలో మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతిలో కూరుకుపోయారు... కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఎవ్వ‌రు అవినీతి చేసినా స‌హించం... మా పాల‌న అంతా ధ‌ర్మ బ‌ద్ధంగా న‌డుస్తుంద‌ని చాలా సార్లు చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ చాలాసార్లు ఈ ప‌దం వాడారు. క‌ట్ చేస్తే ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో కొంద‌రు జ‌న‌సేన ఎమ్మెల్యేలే ప‌వ‌న్ చెప్పిన ధ‌ర్మ ప‌దం ముందు అ అక్ష‌రం క‌లుపుకుని అధ‌ర్మ రాజులుగా మారిపోయారు. దోచుకోవ‌డానికి కాదేది అన‌ర్హం అన్న‌ట్టుగా దోపిడీకి తెగ‌బ‌డుతున్నారు. దొరికింది ఏదీ వ‌ద‌ల‌కుండా దోచుకుకంటున్నారు. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఓ జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధి అయితే దోపిడీలో నెంబ‌ర్ 1 స్థాయికి చేరుకుంటోన్న ప‌రిస్థితి.


మనం రోజూ టీవీ లో యాడ్ చూస్తూ ఉంటాం.. ఇండియాలో ఏం నడుస్తుంది అంటాడూ ఒకతను షాప్ కు వచ్చి ..ఫాగ్ నడుస్తుంది అని అంటాడు షాప్ వాడు.. ఇపుడు స‌ద‌రు జ‌న‌సేన ప్ర‌జాప్ర‌తినిధి నియోజకవర్గంలో ఏమి నడుస్తుందని అడిగితే ఎవరి నోట విన్నా అవినీతి ప‌తాక స్థాయిలో రాజ్య‌మేలుతుంద‌నే చెపుతున్నారు. లిక్కర్ షాపులలో 30% వాటా... పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వచ్చిన 25 కోట్ల ఉపాధి నిధులలో 10%  వాటా ఇదే మాట వినిపిస్తోంది.


ఇటీవ‌ల ఆ నియోజ‌క‌వ‌ర్గంలో లిక్క‌ర్ షాపులు లాట‌రీలో ద‌క్కించుకున్న వ్యాపారుల‌కు మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే ఫోన్‌కాల్స్ వెళ్లిపోయాయి... స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధిని క‌ల‌వాలంటూ హుకూం జారీ చేశారు. క‌లిసిన మరుక్ష‌ణ‌మే షాపుల‌లో పెట్టుబ‌డి లేకుండా 30 % నా వాటా నాకు ఇచ్చేయాల్సిందే అంటూ ఓపెన్‌గానే చెప్పేశార‌ట‌. ఇక గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఇరిగేషన్ మరియు సొసైటీ చెరువులను వేలం పాట ద్వారా పొందినవాళ్ళను బయటకు తోలేసి తన అనుచరులతో ఆక్రమించేశారు. ఇక చేపల చెరువుల ఆక్రమణ చెప్పక్కర్లేదు.. అందులో ఆల్రెడీ ఆరితేరి ఉండ‌డంతో అక్క‌డ అన్యాయాలు.. అక్ర‌మాల‌కు అంతే లేకుండా పోయింది.


మంచినీటి చెరువులున్నీ క‌లుషితం :
స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామీణ ప్రాంతం ఎక్కువ‌... గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఇరిగేషన్ మరియు సొసైటీ చెరువులను వేలం పాట ద్వారా పొందిన వాళ్లు ఉన్నారు. వారు ప్రకృతికి హాని లేకుండా నీటి కలుషితం లేకుండా సహజ సిద్దంగా చేపలు వేసుకుంటూ వ‌స్తున్నారు. ఇలా పాట పాడుకుని చెరువుల్లో చేప‌లు వేసుకున్న వారిని భ‌య‌పెట్టి బ‌య‌ట‌కు పంపేస్తూ... వాటిని త‌న అనుచ‌రుల‌కు క‌ట్ట‌బెట్టుకుంటున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆ చెరువుల్లో కృత్రిమ మేత‌తో పాటు ఇత‌ర చెత్త వేస్తూ గ్రామీణ మంచినీటి చెరువులు అన్నీ క‌లుషితం అయ్యేలా చేయ‌డంలో ఆ ప్ర‌జా ప్ర‌తినిధి ఆరితేరిపోయారు. విచిత్రం ఏంటంటే ఈ దందాలు... అక్ర‌మాల్లో నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌ మండ‌లానికి చెందిన ఓ తెలుగుదేశం నాయ‌కుడు కూడా ఎమ్మెల్యేకు వంత పాడుతూ స‌హ‌క‌రిస్తోన్న ప‌రిస్థితి.


తెలుగుదేశం వారిని అణ‌గ‌దొక్క‌డంలోనూ దిట్ట‌..
అస‌లు స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధి అక్క‌డ తెలుగుదేశం కీల‌క నాయ‌కుడితో పోలిస్తే ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌కుండా టిక్కెట్ ద‌క్కించుకున్నాడు. నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీని గ‌త రెండు ద‌శాబ్దాలుగా పైగా ఒంటి చేత్తో న‌డిపిస్తూ వ‌స్తోన్న సీనియ‌ర్ నేత పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయాల్సి వ‌చ్చింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంకు బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. తెలుగుదేశం మాజీ ప్రజాప్ర‌తినిధి మ‌నస్ఫూర్తిగా ప‌ని చేయ‌డంతో పాటు త‌న కేడ‌ర్‌ను అంతా క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసేలా చేయ‌డంతో ఆ జ‌న‌సేన నాయ‌కుడు గెలిచాడు. గెలిచిన వారం రోజుల నుంచే తెలుగుదేశం నాయ‌కుల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి.. ఆ మాజీ ప్ర‌జాప్ర‌తినిధిని ఎంత మాత్రం ప‌ట్టించుకోకుండా వెళుతున్నాడు. దీంతో స‌ద‌రు జ‌న‌సేన ప్ర‌జా ప్ర‌తినిధిపై నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ కేడ‌ర్ అంతా తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే భ‌విష్య‌త్తులో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తో పాటు ఇత‌ర విష‌యాల్లో స‌ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధి జీరో అవ్వ‌క త‌ప్ప‌ద‌న్న వార్నింగ్‌లు కూడా టీడీపీ నుంచి వెళుతున్నాయి. మ‌రి ఆ నేత ఇప్ప‌ట‌కి అయినా టీడీపీ కేడ‌ర్‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని వెళ‌తాడా.. ఒంటెద్దు పోక‌డ‌ల‌తో పోతాడా ? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: