లేనిపోని విష‌యాల‌ను పెద్ద‌వి చేసి.. రాజ‌కీయంగా ఏదో సాధించాల‌ని అనుకుంటే.. ఒక్కొక్క‌సారి అవి ఎదురు తిరుగుతాయి. ఏదో ఆశించి చేసే ప‌నులు మ‌రెటో దారి తీస్తాయి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలోనూ ఎదురైంది. కొన్నాళ్ల కింద‌ట తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో న‌కిలీ నెయ్యి వినియోగించారన్న అంశం తీవ్ర వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్టారు.


అనంత‌రం తిరుమ‌లకు కాలిన‌డ‌క‌న వెళ్లి.. దీక్ష‌ను విర‌మించారు. ఆ త‌ర్వాత‌.. తిరుప‌తిలో వారాహి స‌భ పెట్టి.. తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. స‌నాత‌న ధ‌ర్మానికి తాను ప్ర‌తినిధిగా పేర్కొన్నారు. అంతేకా దు.. ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌న్న‌ది వాస్త‌వ‌మంటూ ప‌దే ప‌దే ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఇక‌, అయోధ్య రామాల‌యం ప్రారంభోత్స‌వానికి పంపిన ల‌డ్డూలు కూడా.. క‌ల్తీ అయ్యాయ‌ని తెలిపారు. ఈ వ్యాఖ్య‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సారం అయ్యాయి.


అయితే.. ప‌వ‌న్ ఆశించిన‌ట్టు.. స‌నాత‌న ధ‌ర్మం కోసం... ఎంత మందిన‌డుం బిగించార‌న్న విష‌యం సం దేహంగానే ఉంది. కానీ, కీల‌క‌మైన విష‌యం ఏంటంటే..ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ కోర్టులో తాజాగా కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌ముఖ న్యాయ‌వాది ఇమ్మ‌నేనిరామారావు.. స్థానిక నాంప‌ల్లి కోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. హిందువుల మ‌నోభావాలు దెబ్బ తీశాయ‌ని.. స‌మాజంలో క‌ల్లోలం సృష్టించాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.


అంతేకాదు.. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యానించా ర‌ని అన్నారు. ఆయ‌న‌పై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రామారావు.. త‌న పిటిష‌న్‌లో విన్న‌వించారు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మే అయితే. స‌ద‌రు అంశాల‌కు సంబంధించిన ఆధారాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించేలా ఆదేశించాల‌ని.. లేదా న‌కిలీ నెయ్యికి సంబంధించిన ఆధారాల‌నైనా కోర్టుకు ఇచ్చేలా ఆదేశించాల‌ని కోరారు. ఇక‌పై ఎక్క‌డా ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌కుండా నియంత్రించాల‌ని కోరారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు.. ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: