ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గతంలో ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలు ఇచ్చారు. వీటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో హామీ అమలుకు సిద్దమైంది. ఇందులో భాగంగా స్వయంగా సీఎం చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలకు దీపావళి కానుకగా ఈ హామీ అమలు చేయబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు.రాష్ట్రంలో ఎల్పీజి గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింప చేయాలని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని, ఈనెల 31వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభింస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.ఇదిలావుండగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని. ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం అన్నారు. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని సీఎం అన్నారు. 

పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయని సీఎం అన్నారు.అందుకే ఆర్థిక కష్టాలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. అర్హులైన లబ్దిదారుడికి పథకం అందలేదన్న విమర్శ రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 లుగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్కు రూ.25ల సబ్సిడీ ఇస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851లుగా ఉందన్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఐదేళ్లకు రూ.13 వేల 423 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర పడనుంది.ఇదిలావుండగా ఈ పథకం అమలుపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై వారితో చర్చించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు.. మహిళల కోసం దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని చంద్రబాబు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: