ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి. తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో బాధపడగా ఇంటి వద్దే ఆయన పేగుకు శస్త్రచికిత్స చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వెల్లడించాయి. హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ బలగాలు మట్టుబెట్టాక అక్టోబరు నాలుగున టెహ్రాన్ గ్రాండ్ మసీదు నుంచి సందేశమిచ్చినప్పుడు ఖమేనీ ఆరోగ్యంగానే కనిపించారు.
మరోవైపు, ఖమేనీ వినియోగిస్తున్న ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఖమేనీ కొత్త ఖాతా తెరిచి హిబ్రూ భాషలో పోస్ట్ పెట్టారు. ఇరాన్‌ను తక్కువ అంచనా వేసి జియోనిస్ట్ పాలన తప్పు చేసిందని, తమకు ఎలాంటి సత్తా ఉందో చూపిస్తామంటూ ఇజ్రాయెల్‌ను బెదిరించేలా ఆయన పోస్ట్ పెట్టారు. ఆ వెంటనే కారణాలేమీ చెప్పకుండానే ఆయన ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది.
అయితే ఆయన పేరిట ఉన్న మరో అధికారిక ఖాతా యథావిధిగా కొనసాగుతోంది. 2023 అక్టోబరు 7న హమాస్ దాడిని సమర్థించినందుకు నాడు ఖమేనీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను మెటా తొలగించింది. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన దాడిపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పందించారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని, అయితే దేశ ప్రజల హక్కులను కాపాడేందుకు తగిన రీతిలో బదులిస్తామని హెచ్చరించారు. అమెరికా అండతోటే ఇజ్రాయెల్ అఘాయిత్యాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు సైనికులు చనిపోయారని ఇప్పటికే ప్రకటించిన ఇరాన్ మరో పౌరుడు కూడా చనిపోయాడని వెల్లడించింది. 2023 అక్టోబరు 7న తమపై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఏడాదిగా గాజాపై జరుపుతున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య 43 వేలు దాటింది. లక్షమందికి పైగా గాయపడ్డారు. గడచిన 48 గంటల్లో 96 మంది చనిపోయారు. 277 మంది గాయపడ్డారు.
గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రిపై దాడి చేసిన ఐడీఎఫ్ వందమంది హమాస్ మిలిటెంట్లను అరెస్ట్ చేసింది. ఆసుపత్రి నుంచి ఆయుధాలను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.