తాజాగా ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ కోటాలో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.. రెండు జిల్లాల్లో కాలికి బలపం కట్టుకుని మరీ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా తొలగొంతు లేచింది. ఆ గొంతు మంత్రి నాదెండ్ల మనోహర్‌ది కావటం విశేషం. ఆలపాటిని గెలిపించేందుకు తాను రంగంలోకి దిగుతానంటూ.. నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆలపాటికి తాను తప్పకుండా మద్దతు ఇస్తానని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో తెనాలి అసెంబ్లీ స్థానం వాస్తవంగా ఆలపాటి రాజాకు ఇవ్వాలి. కానీ.. జనసేనలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ కోసం ఆలపాటి రాజా తన సీటు త్యాగం చేయక తప్పని పరిస్థితి.
ఆయన తెనాలికి బదులుగా పెదకూరపాడు లేదా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఆశించారు. అయితే అక్కడ కూడా రాజాకు అవకాశం దక్కలేదు. ఇక ఇప్పుడు రాజా ను గెలిపించేందుకు తాను తన వంతుగా కష్టపడతాను అంటూ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో నాదెండ్ల మనోహర్ లీడ్ తీసుకుని.. రాజాను గెలిపించేందుకు తాను ముందు ఉంటానని.. తాను కంకణం కట్టుకుంటానని.. చెప్పటం రాజకు మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.