ఏపీలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టిన మంత్రి లోకేష్.. తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన...ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు సవివరంగా వివరించారు.


పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే ఆ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వివరించారు. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, బయో ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా సత్య నాదెళ్లను లోకేష్ కలిశారు.


అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ అంశాలపై ఆయనతో చర్చించారు. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహరించాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఏపీని సందర్శించాలని సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.


స్పందించిన సత్య నాదెళ్ల.. క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ రంగాల్లోనూ మైక్రోసాఫ్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని తెలిపారు. 2023 వ సంవత్సరంలో 211.9 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించిన మైక్రోసాఫ్ట్.. 2024 అక్టోబర్ నాటికి 3.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ గా ఉందని తెలిపారు.

అనంతరం ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.  రాష్ట్రంలో కొత్త ఐటీ హబ్ లు, ఇనోవేషన్ పార్కులు విస్తరిస్తున్నట్లు తెలిపారు.  వీటిని ప్రపంచస్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని అన్నారు.


అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ గా తయారు చేయాలని భావిస్తున్నట్లు చెప్పిన లోకేష్.. అక్కడ ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఐ విశ్వవిద్యాలయానికి మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు లోకేష్.  దీంతో.. ఏపీలో డిజిటల్ ట్రాన్ ఫర్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల మాట ఇచ్చారని లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: