ఆఫ్ఘనిస్తాన్ లో కొనసాగుతున్న తాళిబన్ల అరాచక పాలన రోజు రోజుకీ పీక్స్ కి పోతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు సైతం ఆప్ఘన్ దేశంపట్ల జాలి కనబరుస్తున్నారు. ఇక అక్కడ మహిళల ఇక్కట్లు అయితే చెప్పదగనివి కాదు. పగవారికి కూడా అక్కడ మహిళల కష్టాలు రాకూడదు. అవును, ఆయుధాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న తాళిబన్లు మహిళలను అంగడి సరుకుగానే చూస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామని.. కల్లబొల్లి కబుర్లు చెప్పిన తాళిబన్లు.. ఇప్పుడు మరోసారి వారి మలినమైన హృదయాన్ని ప్రతిబింబించే ప్రకటన చేసారు.
కొన్నాళ్ల క్రితం మహిళలు చదువుకోడానికి బయట తిరగడానికి కనీసం మేకప్ వేసుకోవడానికి కూడా వీలు లేదంటూ నిషేధం విధించిన తాళిబన్లు, ఇకపై స్త్రీలు అక్కడ బహిరంగ ప్రదేశాలలో మాట్లాడడం కూడా నిషేధమని చెబుతూ ఓ ప్రకటన చేసారు. దాంతో స్థానిక మహిళల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఇక ప్రార్ధనా సమయంలో ఒక మహిళ గొంతు మరొక మహిళకు వినపడకూడదని, పాటలు పాడడం కూడా నిషిద్ధం అంటూ అందులో స్పష్టం చేయడం జరిగింది. కాగా ఈ ఆంక్షల పట్ల మానవ హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ... ఇదెక్కడి దుర్మార్గం అంటూ.. వాపోతున్నారు.
ఇకపోతే, తాళిబన్లు అనబడే నరరూప రాక్షసులు నాగరికత వైపు అడుగులు వేస్తున్న మహిళా సమాజాన్ని కుదేలు చేస్తున్నారు. ఇవేవీ చాలవు అన్నట్లు, కనీసం మహిళలకు సరిగ్గా చదువుకునే స్వేచ్ఛను కూడా కల్పించడంలేదు. కాగా ఇప్పటికే మహిళలు ప్రయాణాలు, ఉన్నత చదువులు, ఉద్యోగాలపై ఆంక్షలు విధించిన తాళిబన్ ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి దారుణ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గం. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కొన్ని ప్రావిన్సులలో మహిళలు కేవలం 3వ తరగతి కంటే ఎక్కువ చదువుకోవద్దు! అంటూ ఒక రూల్ పెట్టిన సంగతి విదితమే. అంతేకాకుండా పదేళ్ల పైబడిన బాలికలు అందరూ కూడా స్కూల్ కి రాకుండా నిషేధాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా తాళిబన్ల ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మారడంతో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.