తాజాగా ‘హురున్‌ చైనా రిచ్‌ లిస్ట్‌’ పేరుతో చైనాలోని అత్యంత ధనవంతుల జాబితా ఒకదానిని విడుదల చేశారు. అందులో బైట్‌డ్యాన్స్‌ (టిక్ టాక్) సంస్థ వ్యవస్థాపకుడు అయినటువంటి "జాంగ్ యిమింగ్" మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆశ్చర్యపరిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్‌ డాలర్లు అనగా, ఇండియన్ కరెన్సీలో రూ.4.11 లక్షల కోట్లుగా ఉందని హురున్‌ వేదిక చెప్పుకొచ్చింది. తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ, భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు జాంగ్ యిమింగ్. ఈ సందర్భంగా చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆవేదన చెందింది.

ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావం ప్రస్తుతం దేశ స్థితిగతులను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద 3 ట్రిలియన్‌ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో 250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. చైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది... అందుకు భిన్నంగా భారత్‌లో మాత్రం వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది అని అందులో రాసుకొచ్చారు.

ఇకపోతే, ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. భారత్‌ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకోవడం విశేషం. మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉందని చెప్పుకోవచ్చు. చైనాలో మొత్తం 753 మంది బిలియనీర్లు ఉండగా భరత్ లో కేవలం 364 మంది మాత్రమే ఉన్నారు. ఇకపోతే 2012లో ప్రారంభమైన బైట్ డాన్స్.. చైనాలో అతిపెద్ద సోషల్ మీడియా వ్యవస్థగా అవతరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ఫీట్ అంత ఈజీగా సాధించలేదు జాంగ్ యిమింగ్. టిక్‌టాక్‌ యాప్‌ను అనేక దేశాలు బ్యాన్ చేసాయి. ఇండియాలో ఇది బ్యాన్ చేసిన విషయం విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: