ఈ మధ్య పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో ఆరోపణలు వచ్చాక తిరుపతిలో ఆయన వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. సెక్యులరిజం పేరుతో హిందూ మతాన్ని అగౌరవపరచడం బాధాకరమని పేర్కొన్నారు. కేవలం హిందూ మతాన్ని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పారు. లడ్డూ కల్తీ కుంభకోణం నుండి, సనాతన ధర్మాన్ని రక్షించడంలో పవన్ బలమైన స్టాండ్ తీసుకున్నారు.
"నరసింహ వారాహి గణం" ఏర్పాటు లక్ష్యాలను పవన్ కళ్యాణ్ ఇంకా వెల్లడించలేదు. గణం ఏర్పాటయ్యాక ఈ అంశం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉత్తరాదిలో పాపులర్ టాపిక్‌గా మారారు, తమిళనాడులో కూడా అతని గురించి చర్చించుకుంటున్నారు. "నరసింహ వారాహి గణం" తమిళనాడుకు విస్తరిస్తే పవన్ మనసులో పక్కా ప్లాన్ ఉందని అర్ధం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ అభిమానులకు కూడా బాగా నచ్చుతున్నారు. ఎందుకంటే ఆయన హిందూ మత పరిరక్షణ ధ్యేయం అన్నట్లుగా నడుచుకుంటున్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన ఒకటి అయ్యే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే జరిగినా జరగవచ్చు. అయితే తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో నిజానిజాలు తెలియకుండా ఆయన జాతీయస్థాయిలో విమర్శలు చేయడం పలు విమర్శలకు తావిచ్చింది.