బ్లడ్, యూరిన్ టెస్ట్ లలో ఫలితాలు నార్మల్ గా ఉంటున్నా ఆరోగ్య స్థితి మాత్రం మెరుగవ్వడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కీళ్ల నొప్పులు నెలల తరబడి వేధిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల వైరల్ ఫీవర్స్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చికెన్ గన్యాను తలపించేలా నొప్పులు ఉన్నాయని కొంతమంది బాధితులు వాపోతున్నారు. ఎన్ని ట్యాబ్లెట్లు వాడుతున్నా రిజల్ట్ కనిపించడం లేదని చెబుతున్నారు.
వయస్సు పైబడిన వాళ్లు అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమవుతోంది. ఎడతెరపి లేని దగ్గు కొంతమంది ప్రాణాలకు అపాయం కలిగిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తాజా ఆహారం తీసుకుంటే ఈ పరిస్థితి కొంతమేర మారుతుంది. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. ఈ కేసుల బాధితుల్లో వైద్యులు సైతం ఉండటం కొసమెరుపు.
కొంతమందిలో జ్వరం లక్షణాలు కనిపించకుండానే కీళ్ల నొప్పులు, ఒళ్ల నొప్పులు సమస్యలు వేధిస్తున్నాయి. చిన్నపిల్లల్లో ఈ తరహా లక్షణాలు కనిపిస్తే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో ఉన్న సమయంలో వైద్య చికిత్స చేయించుకుంటే మంచిది. లక్షణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కలుగుతుందని చెప్పవచ్చు. అవసరమైతే పరీక్షలు చేయించుకుని వైరల్ ఫీవర్ బారిన పడ్డామో లేదో చెక్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వైరల్ ఫీవర్స్ కొన్నిసార్లు ప్రాణాలకే అపాయం కలిగించే ఛాన్స్ అయితే ఉంది.