ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ల విషయంలో ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ పై చంద్రబాబు నాయుడు సీరియస్ కావడం హాట్ టాపిక్ అవుతోంది. మంత్రి సుభాష్ పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్ గా తీసుకోవడం లేదని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిసారి గెలిచిన మంత్రిని పార్టీ ఎంతో గౌరవించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
 
ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిచాక మంత్రి చేశామని అయినా పట్టుదల లేకపోతే ఎలాగయ్యా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మీరు సరిగ్గా పని చేయని పక్షంలో నేను సీరియస్ గా ఆలోచిస్తానని ఆయన వెల్లడించారు. పార్టీకి ఉపయోగపడకపోతే మీకు రాజకీయాలు ఎందుకంటూ చంద్రబాబు పేర్కొన్నారు. పట్టభద్రుల ఓట్ల నమోదు విషయంలో చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు విషయంలో చంద్రబాబు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో 9000 ఓట్లకు కేవలం 2360 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ మొత్తం కేవలం 29 శాతం కావడంతో చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. శనివారం రోజున కేవలం 319 ఓట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. వాసంశెట్టి సుభాష్ ను ఓట్ల నమోదులో మీ నియోజకవర్గం ఎక్కడుందో చూసుకున్నారా? అని ప్రశ్నించారు.
 
మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నానని అనుకోవద్దని నా బాధ్యత నేను చేస్తున్నానని మీ బాధ్యత మీరు చేయాలని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ఎమ్మెల్యేలు తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చెప్పుకొచ్చారు. రోజూ మీకు పరీక్షేనని అన్నారు. లేదంటే నేను ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని ఆయన కామెంట్లు చేశారు. అంచనాల మేరకు పని చేయడం లేదని ప్రజలకే చెబుతానని ఆయన వెల్లడించారు.
 
ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పనితీరు విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఓటరు నమోదు విషయంలో వేగం పెంచాలని మంత్రులు క్రియా శీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు సూచించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలుపు కోసం ఉన్న ఏ అవకాశాన్ని సైతం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: