సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 39వ సమావేశం జరగగా ఇందులో రాజధాని పనులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు జనవరిలోపు కొత్త టెండర్లను పిలవనున్నారని సమాచారం అందుతోంది. మిగతా పనులకు మాత్రం డిసెంబరు 31 లోగానే టెండర్లను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. పాత టెండర్లు అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణకు అడ్డంకిగా మారాయని భోగట్టా.
ఈ టెండర్లను క్లోజ్ చేయడానికి విధివిధానాలను రూపొందించడం కోసం జూలై 24న ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్లతో కూడిన సాంకేతిక కమిటీని నియమించినట్టు తెలుస్తోంది. మంత్రి నారాయణ మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని ఐదేళ్లలో ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా విరాజిల్లడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కొత్తగా టెండర్లు పిలవాలంటే కనీసం 10 నుంచి15 శాతం ధరలు పెరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. కాంట్రాక్టు కంపెనీలకు గతంలో రూ.5 వేల కోట్లు చెల్లించామని ప్రస్తుతం రూ.600 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్లకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి అభివృద్ధి పనులకు ప్రపంచ బ్యాంక్ రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. అమరావతి వేగంగా అభివృద్ధి జరిగితే మాత్రం రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.