అమెరికా అధ్యక్ష ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లు జ‌రుగుతున్నాయి. వైస్ ప్రెసిడెంట్  కమలా హారిస్, మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మ‌ధ్య‌ గట్టి పోటీ నడుస్తుంది. ఎన్నికల ఫలితాలు అగ్రరాజ్యం అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచ శాస్త్రీయ సాంకేతిక సమాజానికి కూడా కీలకంగా మారబోతున్నాయి. ఇద్దరు అభ్యర్థులు పూర్తిగా భిన్నమైన అజెండాలను ప్రదర్శించడంతో  రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ విజ్ఞాన విధానాన్ని గణనీయంగా ప్రభావితం చేయబోతున్నాయి. అమెరికా  అధ్యక్షురాలిగా ఎన్నికల్లో కమలా హరిస్‌ గెలిస్తే, జో బైడెన్ తన అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన సైన్స్ ప్రాధాన్యతలను మరింత విస్తరించే ఛాన్స్ కూడా ఉంది. వాతావరణ మార్పులపై కీలక చర్యలు చేపట్టనున్నారు. అలాగే సాంకేతిక పరిశోధనకు అవసరమైన నిధులకు మెరుగైన అంతర్జాతీయ సౌకర్యాన్ని అందించే ఛాన్స్ కూడా ఉంది.


హారిస్ ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సును పెంపొందించడంలో సైన్స్, టెక్నాలజీ పాత్రను గుర్తించి, దానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.  ఆమె విధానాలు వాతావరణం, పునరుత్పాదక ఇంధనం, ఆవిష్కరణలలో ప్రగతిశీల కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆమె నాయకత్వంలో, పారిస్ ఒప్పందం లాంటి అంతర్జాతీయ ఒప్పందాలకు,  క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌ లో మరిన్ని పెట్టుబడులకు అమెరికా కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నారు. అలాగే మరోవైపు సహజ వాయువును ఫ్రాకింగ్ చేయడాన్ని నిషేధించవద్దని కూడా ఆమె ప్రసంగాల్లో చెప్పారు.  ఈ నిర్ణయం పర్యావరణవేత్తలు అంతగా రిసీస్ చేసుకోలేకపోతున్నారు.మరోవైపు, ఆరోగ్యం, సాంకేతికత, పర్యావరణంలో చారిత్రాత్మ పురోగతి సాధించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH), నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF) వంటి కీలకమైన ఏజెన్సీల కోసం బడ్జెట్‌లను హారిస్ పెంచే అవకాశం కనిపిస్తోంది. అటు బైడెన్ పాలనలో భారత్ అమెరికాతో కలిసి చంద్రుడిపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకమైన ఆర్టెమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది.


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఓ భారతీయ వ్యోమగామి ఇప్పటికే అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడు. బైడెన్ పాలనకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించినట్లు ట్రంప్ గత పాలన సూచిస్తోంది. ట్రంప్ తాజా ఎన్నికల ప్రచారం ఫెడరల్ పరిశోధనా సంస్థలను పునర్నిర్మించేలా ప్రణాళికలు ప్రకటించారు. ఇందులో కొన్ని ఏజెన్సీలను ఏకీకృతం చేసే అవకాశాన్ని ఆయన తెర మీదికి తీసుకొచ్చారు. మరికొన్ని ఏజెన్సీలను తొలగించనున్నట్లు తెలిపారు.  ఇక ట్రంప్ నిర్ణయం తన ప్రాథమిక పరిశోధనలకు అస్థిరపరుస్తామని ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చే వ్యవస్థకు ఇబ్బంది కలిగి అవకాశం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ గత పాలనలో NIH,NSF బడ్జెట్లో కోత కూడా విధించారు. ప్రస్తుత ప్రచారంలో శిలాజ ఇంధన ఉత్పత్తికి మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయం వాతావరణ మార్పుల ఉపశమన వ్యూహాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు పలువురు నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ విజయం సాధిస్తే, ఆయన కేబినెట్ లో టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలోన్ మస్క్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.


ఒకవేళ అదే జరిగితే అంతరిక్ష పరిశోధనలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. అలాగే మరోవైపు క్లైమేట్ సైన్స్ పై ట్రంప్ హరిస్‌ విధానాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉండటం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకించి  ట్రంప్ పాలనలో సైన్స్ ఆధారిత విధానంలో రాజీ పడే అవకాశం ఉందంటున్నారు.  అంతేకాదు, సైన్స్‌ లో అంతర్జాతీయ సహకారం కూడా ప్రమాదంలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఇక ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం ప్రపంచ పరిశోధన సంస్థలకు సహకారాన్ని తగ్గించడానికి దారి తీసి అవకాశం కూడా ఉంది. హారిస్ పరస్పర శాస్త్రీయ పురోగతికి మద్దతు ఇచ్చే భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని భావిస్తున్నారు. అంతేకాకుండా 82 మంది నోబుల్ గ్రహీతలు హరీస్‌ కు మద్దతు పలకడం ఎక్కడ విశేషం. ఇప్పుడు తాజాగా వస్తున్న ఫలితాల ప్రకారం అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ నియామకం దాదాపు ఖరారు అయిపోయింది. ఇక మరి ట్రంప్ అధ్యక్షుడిగా సైన్స్ ప్రపంచం పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: