వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప అంటేనే వైసీపీకి ఎంత కంచుకోట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైసీపీకి కడప పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఆ మాటకి వస్తే గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కడపలో తన పట్టు ఏనాడు నిలుపుకోలేదు. నాలుగు ఎన్నికలలో రెండుసార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత.. వైసీపీ ఆవిర్భవించాక రెండుసార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో తెలుగుదేశం చావు దెబ్బతింది. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో కడప, పులివెందుల, రాజంపేట మినహా మిగిలిన ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు తిరుగులేని భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు.
ఎన్నికల్లో ఘోర ఓటిమి తర్వాత జగన్ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తన మేనమామ అయిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని నియమించారు. అయితే రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే కడప నియోజకవర్గంలో తన హవా కొనసాగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడప నియోజకవర్గంలో వైసీపీ మూడుముక్కలుగా చీలింది. రవీంద్రనాథ్ రెడ్డి గతంలో కడప మేయర్‌గా పనిచేయడంతో ఆయన తన వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రవీంద్రనాథ్ రెడ్డి పెత్తనాన్ని అసలు సహించడం లేదు. ఆయన తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కడప మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ బాబు కూడా తన వర్గాన్ని ప్రోత్సహించుకుంటూ కడప నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కడప నియోజకవర్గ వైసీపీలో పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయింది. ముగ్గురు ఎవరికి వారు పట్టుఉన్న నేతలు కావడంతో.. ఎవరి హవా చెలాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పార్టీ చీలికలు పిలుకలు అయిపోయింది.