వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చాలా బలంగా ఉంది. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకంగా 151 సీట్లు కట్టబెట్టి జగన్కు తిరిగిలేని మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారు.. అక్కడి వరకు బాగానే ఉంది. ఐదేళ్లపాటు సంక్షేమంపై దృష్టి పెట్టిన జగన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పూర్తిగా కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఈ యేడాది జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ జనాలు వైసీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసి జగన్ను మూలను కూర్చోబెట్టారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చివరకు తనకు సన్నిహితులు... నమ్మిన బంటుగా .. కుడి భుజంగా ఉన్న వాళ్ళను సైతం నమ్మలేదు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడిన వారిని సైతం విస్మరించిన పరిస్థితి. అందుకే జగన్ బంధువులుగా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి - జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిళా రెడ్డి - జగన్ తల్లి వై ఎస్ విజయలక్ష్మి - జగన్ బాబాయ్ కుమార్తె వైయస్ సునీత రెడ్డి లాంటి వాళ్లు సైతం జగన్‌కు దూరమైన పరిస్థితి.
ఇలా సొంతవాళ్లే దూరమవుతుంటే ఇక నియోజకవర్గాల్లో ఇన్చార్జిలు .. మాజీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ దగ్గర ఎందుకు ? ఉంటారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 80 కు పైగా నియోజకవర్గాలలో వైసిపి నాయకత్వ సమస్య ఎదుర్కొంటున్న పరిస్థితి. అసలు వైసిపి నుంచి పోటీ చేసేందుకు ఈ నాలుగేళ్లపాటు వైసీపీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో కనీసం 80 శాతం మంది ఈ నాలుగేళ్ల పాటు అసలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాలు పెరిగితే వైసీపీకి మొత్తం 130 నియోజకవర్గాలలో తీవ్రమైన నాయకత్వ సమస్య ఎదురవుతుంది. ఏది ఏమైనా జగన్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అన్నది నిజం.