ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పే నేడు అధికారంలో వున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది.. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఉపాధ్యాయ నియామకాలు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు లక్షల మంది వున్నారు.. ఉపాధ్యాయ కొలువే లక్ష్యంగా వేలకు వేలు కోచింగ్ సెంటర్స్ కు ధారపోస్తున్నారు.. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సి పరీక్ష నిర్వహించి 6 సంవత్సరాలు గడిచిపోయాయి.. ఈ ఆరేళ్ళలో ఉపాధ్యాయ కొలువు కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎదుర్కున్న బాధలు అంతా ఇంతా కాదు.. గతంలో ఎన్నికల ప్రచారంలో దేవుని దయతో మన ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సి ప్రకటిస్తాము అని ప్రగల్భాలు పలికిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని గాలికొదిలేసారు.. కంటి తుడుపు చర్యగా  రెండు సార్లు టెట్ నిర్వహించి  సార్వత్రిక ఎన్నికలు రెండు నెలలో వున్నాయి అనే సమయానికి 6100 పోస్టులతో దగా డీఎస్సి నోటిఫికేషన్ జారీ చేసారు.. 

మెగా డీఎస్సి అని ప్రగల్భాలు పలికి కేవలం 6100 పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయడం అది కూడా ఎన్నికలు మొదలయ్యే లోపు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏ మాత్రం సమయం కూడా ఇవ్వకుండా హడావుడిగా పరీక్షలు నిర్వహించాలని చూసారు..దానితో ఉపాధ్యాయ నిరుద్యోగులు భగ్గుమన్నారు.. రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసారు.. ఈ పోస్టులు లేని దగా డీఎస్సి మాకొద్దని రాష్ట్రమంతా ధర్నాలు చేసారు.. ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డీఎస్సి ప్రక్రియ నిలిచిపోయింది..దీనిని అదునుగా భావించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సి పైనే చేస్తామని హోరెత్తించారు.. అప్పటి ప్రతి పక్షనేతగా వున్న చంద్రబాబు నాయుడు గారు అత్యధిక డీఎస్సి లు నిర్వహించిన ఘనత తమదేనంటూ గొప్పలు చెప్పుకొని ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు బలమైన హామీ ఇచ్చారు.. అప్పటికే అలసిపోయి వున్న అభ్యర్థులలో ఆ హామీకీ ప్రాణం లేచి వచ్చినట్లు అయింది..

 దీనితో 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమికి ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులంతా భారీగా ఓటు వేసి గెలిపించారు..చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూటమి 164 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు 16,347 పోస్టుల  మెగా డీఎస్సి ఫైలుపై తొలి సంతకం చేసారు.. డీఎస్సి ప్రక్రియ డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనీ అధికారులని ఆదేశించారు.. విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన నారా లోకేష్ డీఎస్సి ప్రక్రియపై దృష్టి పెట్టారు.. ముందుగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసి ప్రిపరేషన్ కు 90 రోజులు గడువు ఇచ్చారు..తాజాగా టెట్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలు కూడా ఇచ్చారు.. నవంబర్ 6 డీఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ ముందు రోజు వరకు ఎంతో ఆర్భాటం చేసారు.. తీరా నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి సాంకేతిక కారణాల దృష్ట్యా నోటిఫికేషన్ ప్రకటన వాయిదా వేసినట్లు తెలిపారు..అయితే నోటిఫికేషన్ ఆలస్యానికి కారణం వేరే వుంది..

ఇటీవల ఎస్సి వర్గీకరణకు సుప్రీం కోర్టు ఆమోదం తెలపడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘ సమితి స్థాపకుడు అయిన మందకృష్ణ మాదిగ నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఎస్సి వర్గీకరణ అమలుపై సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా ఎస్సి వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వొద్దని అడగటం జరిగింది..ఎస్సి వర్గీకరణకు పూర్తి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.. దీనితో ఎస్సి వర్గీకరణకు కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్స్ అమలు చేయాలనీ చంద్రబాబు ఆలోచన చేసారు…. దీనితో త్వరలోనే ఎస్సి వర్గీకరణకు కమీషన్ వేయనున్నారు.. అయితే నోటిఫికేషన్ వస్తుంది.. వచ్చే విద్యాసంవత్సరానికి ఉద్యోగం పొందుతామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది.. ఎస్సి వర్గీకరణ పూర్తి అయ్యేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి.. ఈ లోపు నిరుద్యోగ అభ్యర్థులు తమ వయోపరిమితి కోల్పోయే పరిస్థితి వుంది.. దీనితో అభ్యర్థులు ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకుంటున్నారు.. మా నోటిఫికేషన్ పై కరుణ చూపండి అని వేడుకుంటున్నారు.. మా నిరుద్యోగుల జీవితాలపై రాజకీయ రంగు పులమొద్దు అని ప్రాధేయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: