విజయనగరం జిల్లాలో బొబ్బిలి సంస్థానాధిశుడిగా.. ఆ వంశం లో ప్రస్తుతం తరంలో రాజకీయాల్లో రాణించిన వారిగా.. మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఉన్నారు. ఆయన బొబ్బిలి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో ఆయన టికెట్ తీసుకోలేదు. 2004 - 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే గా విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం వైసీపీ లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన టీడీపీ కండువా కప్పుకుని చంద్రబాబు కేబినెట్లో మంత్రి గా పనిచేశారు.
ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తమ్ముడు బేబీ నాయనకు అవకాశం ఇచ్చారు. ఇక సుజయ్ కృష్ణ విజయనగరం ఎంపీ సీటుకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగిన.. అది ఎందుకో జరగలేదు. అలా సుజయ్ కృష్ణ రంగారావు రాజకీయానికి కొంతకాలంగా బ్రేక్ పడినట్టు అయింది. అయితే రెండవ విడత నామినేటెడ్ పదవులు పంపిణీలో ఆయనకు ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఇది క్యాబినెట్ ర్యాంక్ పదవి అవునో.. కాదో.. తెలియదు.
మంత్రిగా గతంలో పనిచేసిన రంగారావుకు ఇప్పుడు నామినేటెడ్ పదవి ఇవ్వటం ఆయనకు తగిన న్యాయం జరిగినట్టేనా.. అన్నది ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం నడుస్తోంది. ఎమ్మెల్సీ ఇస్తారని కొద్ది రోజుల వరకు ప్రచారం సాగింది. మంత్రిగా చేసిన వారిలో ఆయనకు ఈ పదవి ఇచ్చారు. మిగిలిన వారు అంతా మాజీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన ఆశావాహులే ఎక్కువగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అయినా ఆయనకు కీలక అవకాశాలు ఉంటాయని అనుచరులు, అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు దక్కిన ఈ పదవి ప్రమోషనా.. లేక డిమోషనా.. లేక ప్రోత్సాహంగా అన్నది చెప్పలేని పరిస్థితి.