ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ఎమ్మెల్సీ కూడా చేరిపోయారు. ఆయన ఎవరో కాదు ? మాజీ ఎంపీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న పండుల రవీంద్రబాబు. గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసిన రవీంద్రబాబు 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో ఆయనకు చంద్రబాబు ఎంపీ సీటు ఇవ్వలేదు. బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్‌కు సీటు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి రావడంతో వైసిపి కండువా కప్పుకున్నారు. 2021 లో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ఇక రవీంద్రబాబు ఎమ్మెల్సీ పదవీకాలం మరో మూడు సంవత్సరాలు ఉండగానే ఆయన తన ఎమ్మెల్సీ పదవి వదులుకొని వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడంలేదని పార్టీలో అస్సలు గౌరవం లేదని ఆయన వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇక వైసిపి కి గుడ్ బై చెబుతున్న రవీంద్రబాబు జనసేనలో చేరాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే జనసేన పార్టీ పెద్దలతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.