అవును, మీరు ఇక్కడ చదివింది నిజమే. నిర్లక్ష్యంగా వైద్య సేవలు నిర్వహించినందుకు గాను సదరు ఆసుపత్రికి పెద్ద మొత్తంలో ఫైన్ విధించారు. రోగి అవస్థకు కారణమైన "సాయికృష్ణ సూపర్ స్పెషాలిటీ న్యూరో హాస్పిటల్ ప్రైవేటు లిమిటెడ్"కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 భారీ మొత్తంలో జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే... తార్నాకకు చెందిన ఎస్.రవీందర్‌రెడ్డి ఫిర్యాదును విచారించిన కమిషన్.. ఆసుపత్రి, వైద్యులు సంయుక్తంగా రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో వారికి అలా కావసిందేనని జనాలు అభిప్రాయ పడుతున్నారు.
కాస్త వివరాల్లోకి వెళితే... తార్నాకకు చెందిన ఎస్.రవీందర్‌రెడ్డి కుడిచేతి చిటికెన వేలు, ఉంగరం వేలు కదిలించేందుకు ఇబ్బందిగా మారడంతో కాచిగూడలోని సాయికృష్ణ సూపర్ స్పెషాలిటీ న్యూరో హాస్పిటల్‌లో వైద్యుల దగ్గరకి వెళ్లి తన సమస్యను చెప్పాడు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. సర్వైకల్ మైలోపతి (వెన్ను సంబంధిత సమస్య) ఉన్నట్టు పేర్కొన్నారు. చికిత్సలో భాగంగా సర్వైకల్ లామినెక్టమీ చేయాలని సూచించిన వైద్యుల బృందం (ప్రతివాదులైన డా.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్.శ్రీధర్‌రెడ్డి, డా.ఏ.ఆర్.రెడ్డి, డా.జి.రామ్‌రెడ్డి, డా.జోగేంద్రకుమార్, డా.స్వర్ణకుమారి, డా.కె.లక్ష్మణ్‌రావు) సూచించగా 2020 ఫిబ్రవరి 20న శస్త్రచికిత్స పూర్తిచేశారు.
అయితే, మొదట చేసిన ఆపరేషన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయడానికి రెండో ఆపరేషన్ చేశారని, దీంతో 11 నెలలు దారుణమైన అవస్థలు పాలయ్యానని, ఆపరేషన్ సహా మొత్తంగా దాదాపు రూ.2కోట్లు ఖర్చయిందని ఆధారాలు సమర్పించారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రతివాద ఆసుపత్రి.. శస్త్రచికిత్స, తరువాత పరిణామాలపై ఫిర్యాదీ అటెండెంట్ లక్ష్మికి వివరించినట్టు రాతపూర్వక వివరణలో పేర్కొంది. ఇందులో వైద్య నిర్లక్ష్యం లేదని, ఫిర్యాదును కొట్టివేయాలని కోరింది. అయితే... సాక్ష్యాలు, కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైదరాబాద్ కమిషన్-2 బెంచ్.. ఇందులో ఆసుపత్రి నిర్లక్ష్యం ఉందని, ఫలితంగానే ఫిర్యాదీ వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స కోసం రూ.లక్షల్లో వెచ్చించారని పేర్కొంటూ.. రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.