పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిసహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల  మరోసారి తప్పుబట్టారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం జగన్‌కు లేదా అని ప్రశ్నించిన షర్మిల అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మైకు ఇవ్వరని చెబుతూ మారాం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే శాసనసభకు వెళ్లకుండా జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లాలని కాంగ్రెస్ తరఫున లేఖ రాసినట్లు తెలిపారు. విజయవాడలో మీడియాతో వైఎస్‌ షర్మిల మాట్లాడారు.ఈ నేపథ్యంలో జగన్‌ అహంకారం, అజ్ఞానం బయటపడుతోందని వైఎస్ షర్మిల అన్నారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేవా? దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలనూ ఇవే ప్రశ్నలు అడుతున్నామని అన్నారు. సభకు వెళ్లకపోవడమంటే ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా? అని ప్రశ్నించారు. బడ్జెట్‌ ప్రవేశపెడితే వైఎస్సార్సీపీ సభ్యులు కనీసం హాజరు కాలేదని గుర్తు చేశారు. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై జగన్ తొలిసారి స్పందించారు.

అసెంబ్లీకి వెళ్లని వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్ పై స్పందించాలని జగన్ ను ఓ మీడియా ప్రతినిధి కోరగా అందుకు జగన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తనతోపాటు వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేస్తారని ప్రచారం జరుగుతోదంని, కానీ, తనను, వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేసే అధికారం వీరికి లేదని జగన్ అన్నారు. ఒకవేళ తనను డిస్ క్వాలిఫై చేయాలనుకుంటే తాను రెడీ అని, తాను ఇక్కడే ఉన్నానని, డిస్ క్వాలిఫై చేసుకోవచ్చని జగన్ ఛాలెంజ్ చేశారు.ఇక, తన చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడవద్దని జగన్ అన్నారు. అయినా, ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ గురించి, 1.17 శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని జగన్ తేల్చేశారు.ఇక, 2019లో చంద్రబాబు పోతూ పోతూ తన ప్రభుత్వానికి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చారని, 42 వేల 183 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చి వెళ్లారని జగన్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అప్పులంటూ తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు కన్నా తాను తక్కవ అప్పులే చేశానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా పెట్టిన బడ్జెట్ లో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు.ఇదిలావుండగా సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టేందుకే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని జగన్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: