- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

రఘురామ‌ కృష్ణంరాజు తెలుగు రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. రఘురామ దాదాపు ప్రతి ఎన్నికకు ఒక పార్టీ మారుతూ వస్తున్నారు. ముందు ఆయన కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి వీరాభిమానిగా ఉంటూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైసీపీలోకి వెళ్లారు. 2014 ఎన్నికలకు ముందు వరకు నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్నారు. అనంతరం ఆ ఎన్నికలకు ముందు బిజెపిలోకి వెళ్లారు. అక్కడ నుంచి తెలుగుదేశం లోకి వచ్చారు. చివరకు 2019 ఎన్నికల సమయంలో తిరిగి వైసీపీలోకి వెళ్లి నరసాపురం ఎంపీగా స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన ఏడాదికే వైసీపీతో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తో విభేదించడం ప్రారంభించారు.


చివరకు జనసేన - బిజెపి - తెలుగుదేశం మూడు పార్టీలతో సన్నిహితంగా ఉంటూ ఈ యేడాది జరిగిన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న భారీ అంచనాల నేపథ్యంలో కేవలం డిప్యూటీ స్పీకర్తో సరిపెట్టుకున్నారు. వాస్తవానికి ఈ పదవి కూడా జనసేనకు కేటాయించాలని ముందుగా చంద్రబాబు అనుకున్నారు. స్పీకర్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడంతో .. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణలతో పాటు గత వైసిపి ప్రభుత్వంపై ఎంతో పోరాటం చేసిన రఘురామ‌ కృష్ణంరాజుకు ఏదో ఒక పదవి ఇవ్వాలన్న అంచనాల నేపథ్యంలో చివరకు పవన్ కళ్యాణ్ సైతం రఘురామ పై ఉన్న ప్రేమ నేపథ్యంలో తమ పార్టీకి రావలసిన డిప్యూటీ స్పీకర్ పదవి త్యాగం చేయక తప్పని పరిస్థితి. అలా రఘురామకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి వెనక పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం స్పష్టంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: