ప్రస్తుతం రాయలసీమలో చుక్కనీరు లేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో టీడీపీ నాయకులే ప్రస్తావించారు. ఇక, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. తాగు నీటి కోసం 20 కిలో మీటర్లు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ట్యాంకర్లు అయినా ఏర్పాటు చేయాలన్నది స్థానికుల మాట. కానీ, ఇప్పటి వరకు అలాంటి ఏర్పాట్లు సాగలేదు. ఈ సమస్యపై షర్మిల స్పందించాలని తులసిరెడ్డి వంటి సీనియర్లు కూడా కోరుకుంటున్నా.. ఆమె మాత్రం ఉలకడం లేదు. పలకడం లేదు.
ఇక, కర్నూలు జిల్లా విషయానికి వస్తే.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు స్థానికంగా జగన్ హయాంలో కేటాయిం చిన లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ ఆఫీసులను ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం 2014-19 మధ్య తీసుకున్న నిర్ణయం మేరకు.. వాటిని రాజధాని అమరా వతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, వాటిని తరలించవద్దని ఇక్కడ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని కూడా షర్మిల పట్టించుకోవడం లేదు.
ఇక రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపు, బెల్టు షాపులు వంటివి రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి.. తమ ప్రాంతాల్లో బెల్టు షాపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు మద్యం దుకాణాలనే ఏర్పాటు చేయకుండా అడ్డు తగులుతు న్నారు. మొత్తంగా చూస్తే.. ప్రజల సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. కానీ, ప్రజల కోసం పోరడతానని, తాను రాజన్న బిడ్డనని పదే పదే చెప్పుకొనే షర్మిల మాత్రం ఈ విషయంలో స్పందించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుండడం గమనార్హం.