మనదేశంలో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు అదాని ₹2,029 కోట్ల లంచాలు ఇచ్చారని తెలుస్తోంది.  దీనిపై అమెరికాలోని న్యూయార్క్ లో గౌతమ్ అదానీ పై కేసులో నమోదయ్యాయి. ఈ వ్యవహారం భారత్ లో సంచలనం సృష్టించింది..  



దీనిపై రాజకీయ పార్టీలు “నువ్వా నేనా” అన్నట్టుగా విమర్శలు చేసుకుంటున్నాయి.. గౌతమ్ ఆదాని అరెస్టుకు జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని.. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.  దీనిని బీజేపీ నాయకులు బలంగా తిప్పి కొట్టారు.  మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌతమ్ అదాని తో భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు విరాళం కూడా ఇచ్చారు. పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దావోస్ పర్యటనలో 12 వేల కోట్లకు మించి వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. మరి దానిపై ఏం మాట్లాడతారంటూ” బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు.  


బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేస్తోంది. ఆదానితో అల్లుకుపోతున్నారని.. అతని కొడుకు కరణ్ తో అనేకమార్లు సమావేశమయ్యారని.. స్కిల్ యూనివర్సిటీకి ఆదాని 100 కోట్లు విరాళం ఇచ్చారని ఆరోపణలు చేస్తోంది.  విద్యుత్ ఒప్పందాల కోసం అదాని గ్రూప్ భారీగా ముట్ట చెప్పినప్పుడు.. ఇక్కడ ఎంత ముట్టాయోనని విమర్శలు చేస్తోంది.  ఈ ఏడాది జనవరి 23న దావోస్ లో గౌతమ్ అదానితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అక్టోబర్ 18న కూడా గౌతమ్ అదానీని రేవంత్ కలిశారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.  బిజెపి, బీఆర్ఎస్‌ లు కార్నర్ చేయడంతో రేవంత్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ” రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా రావచ్చు. కంపెనీలు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే మేము స్వాగతిస్తాం. అభివృద్ధి కోణంలో మాత్రమే మేం పని చేసాం. అదానిపై కేసు నమోదయింది న్యూయార్క్ లో. ఇక్కడ కాదు. దర్యాప్తు సంస్థలు తన పని తాము చేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వపరంగా ఎటువంటి తప్పులు జరగలేదు. రేవంత్ పై విపక్షాలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్ధరహితమని” భట్టి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: