2022 ఫిబ్రవరి నుంచి మొదలైన ఈ యుద్ధంలో రష్యా తొలిసారిగా ICBMని ఉపయోగించింది. ఈ మిసైల్ రష్యా దక్షిణ భాగంలోని అస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఈ మిసైల్ రకం లేదా దాని నిజమైన లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేయలేదు. ఈ దాడిలో డెనిప్రోలోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, ఒక పారిశ్రామిక కర్మాగారం దెబ్బతిన్నాయి. దీంతో అగ్ని ప్రమాదాలు సంభవించాయి మరియు ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఈ వారం ప్రారంభంలో ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ సరఫరా చేసిన క్షిపణులతో రష్యా భూభాగంలో దాడులు చేసిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ దాడులతో యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని రష్యా ముందే హెచ్చరించింది. ఉక్రెయిన్ అమెరికా సరఫరా చేసిన ATACMS క్షిపణులు, బ్రిటిష్ స్టార్మ్ షాడో క్రూజ్ క్షిపణులతో రష్యాకు చెందిన కుర్స్క్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అయితే, ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ ఈ దాడులను నిర్ధారించలేదు. రష్యా ఈ విషయంపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.
డెనిప్రోపై జరిగిన దాడిలో ICBMతో పాటు రష్యా కింజాల్ హైపర్‌సోనిక్ మిసైల్, ఏడు కెహెచ్-101 క్రూజ్ మిసైళ్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ దళాలు ఆరు క్రూజ్ మిసైళ్లను అడ్డుకున్నాయి. 1000 రోజులకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో తీవ్రత పెరుగుతూనే ఉంది. ICBM దాడిపై రష్యా ఏమీ స్పందించలేదు. ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇంకా ఇలాంటివి వాడితే ప్రపంచానికి ముప్పు కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భయపడుతున్నారు. ఇది ఏమైనా ఈ యుద్ధం ఆగిపోయేదాకా ఇలాంటి ఆందోళనలు తగ్గవు.