ఈ సమిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఇండో-జర్మన్ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం మొదలైందన్నారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు సదరు తెలుగు న్యూస్ ఛానెల్ గ్రూప్‌నకు ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. జర్మనీ గురించి తెలుసుకునేందుకు ఇది ఒక కొత్త అవకాశమన్నారు. భారత్‌కు ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి అని ప్రధాని చెప్పారు. రానున్న కాలంలో భారత్ - జర్మనీ మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
మై హోం గ్రూప్ వైస్ చైర్మన్ రాము జూపల్లి ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ.. భారతదేశానికి యువశక్తి గొప్ప సంపద. సరికొత్త ఆవిష్కరణలతో ఎన్నో అంకుర సంస్థలు భారతదేశంలో విజయవంతంగా ఎదిగి, అభివృద్ధి సాధించాయి. కొత్త ఆవిష్కరణలతో వచ్చే సంస్థలకు భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం నలువైపుల నుంచి భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించడానికి ముందు సదరు మీడియా ఛానెల్స్ న్యూస్ నెట్వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ.. ఆయనకంటూ ఓ ప్రత్యేకను గుర్తింపును సంపాదించుకుని ప్రపంచ నేతగా ఎదిగారని పేర్కొన్నారు. rrr అంటే రిలేషన్ షిప్, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ప్రధాని మోదీ వ్యక్తిత్వం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.