ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మంచి జోష్లా ఉంది. అటు చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైసిపి పూర్తిగా డీలా పడిపోయింది. వైసీపీ అధికారం కోల్పోవడంతో అసలు ఆ పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారో ? కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలోని ఏలూరు జిల్లాలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి కిలక నేతలు అందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీంతో ఫ్యాను రెక్కలు ఊడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేశారు. ఇంతలోనే కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా వైసీపీలో భారీ కుదుపు ఏర్పడింది. దీంతో కొల్లేరు నియోజకవర్గంలో పార్టీ మరింత డీలా పడిపోయినట్టు అయింది. జయ మంగళ ఏ పార్టీలో చేరుతారో ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఆయన జనసేనలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. 2009 ఎన్నికలలో కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకటరమణ 800 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో బిజెపితో పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాస్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. 2019లో టిడిపి తరఫున పోటీ చేసి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత వైసిపి కండువా కప్పుకున్న ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినా పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం కైకలూరు వైసీపీ నేతలు ఆధిపత్యం ప్రదర్శించటం... అధికారులు అందరూ అప్పటి ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేయడంతో ఎమ్మెల్సీ పదవి నామమాత్రం అయింది.
దీంతో పదవి ఉన్నా ప్రాబ్లం లేని నేతగా మిగిలిపోయారు. గత ఎన్నికలలో సైతం ఆయన వైసిపి ప్రచారంలో పెద్దగా యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న దూలం నాగేశ్వరరావు నియోజకవర్గంలోనే ఒక కీలక నేత ఎమ్మెల్సీ పార్టీని వెళ్లడంతో వైసీపీ శ్రేణుల్లో అలజడి రేగింది. మొన్న ఆళ్ల నాని ఆ తర్వాత ఏలూరు మేయర్ అలా వైసీపీ జట్టు మొత్తం కూటమి గూటికి చేరిపోయింది. ఇక కైకలూరులో సైతం పలువురు జడ్పిటిసి .. ఎంపిటిసి సభ్యులు .. ఎంపీపీలు కూటమి తీర్థం పుచ్చుకున్నారు. దెందులూరు - చింతలపూడి - పోలవరం ఇలా ప్రతి నియోజకవర్గంలో వలసలు ముమ్మరంగా సాగుతున్నాయి దీంతో ఏలూరు జిల్లాలో పార్టీ పుంజుకోవడం చాలా కష్టంగా కనిపిస్తోంది.