- ( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ప్ర‌తినిధి )


* ఖమ్మంలో అట్టహాసంగా వన సమారాధన
* సుమారు 50 వేల మంది హాజరు
* ఖమ్మం జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి..
* ఒకరకంగా బల  ప్రదర్శనే అంటున్న విశ్లేషకులు


కార్తీక మాసం అంటేనే వన సమారాధనల సమయం. తెలుగు రాష్ట్రాల్లో కుల సమారాధనలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం ఖమ్మం లో జరిగిన  కమ్మవారి మహా జన వన సమారాధన కళ్ళు చెదిరే రీతిలో సాగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు 50 వేల మంది కమ్మ సామాజిక వర్గం వారు ఈ వనభోజనాలకు తరలిరావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఇంతటి స్థాయిలో జనం తరలి రావడంతో నిర్వాహకులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. అయితే గతంలో ఎప్పుడైనా చెరుకూరు వారి మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించేవారు కానీ ఈసారి నిర్వాహకులు వేదికను మార్చారు. వైరా రోడ్ లోని వెలుగుమట్లలో 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్ ను వన సమారాధనకు ఎంపిక చేశారు. అయితే ఈ వేదిక ఎంపిక విషయంలో కమ్మ సంఘం పాలకవర్గం మధ్య విభేదాలు కారణమయ్యాయని గుసగుసలు వినిపించాయి. పాలకవర్గంలో లుకలుకలు ఉన్నాయని.. ఈ క్రమంలో అసలు ఈసారి వనభోజనాల కార్యక్రమం ఏ మేరకు విజయవంతం అవుతుందో అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తం అయ్యాయి.  కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ కమ్మజనులంతా వేలల్లో తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది.


వెంకటేశ్వర స్వామి, శివుడితోపాటు ఎన్టీఆర్‌కు పూజలు..
తొలి నుంచి ఖమ్మం జిల్లా కమ్మవారికి కంచుకోటగా ఉంది. ముఖ్యంగా వెండితెర ఇలవేల్పు.. నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ వారికి అమితమైన ప్రేమ. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాల్లో ఎంతోమంది టీడీపీని వీడి వివిధ పార్టీల్లో చేరారు. కానీ తెలంగాణలోనే ఇప్పటికీ తెలుగుదేశానికి బలమున్న జిల్లాగా ఖమ్మం జిల్లా నిలిచింది. అలాంటి ఖమ్మంలో ఆదివారం జరిగిన కమ్మ మహాజన సంఘ వ‌న సమారాధన కార్యక్రమం రాజకీయాలకతీతంగా జరిగినప్పటికీ.. ఎన్టీఆర్ ను మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. తెలుగు వారందరికీ ఆరాధ్య దైవమై న ఆనందమూరి తారక రాముని కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఇక్కడ దేవాలయ సెట్టింగులో ఉంచి పూజలు చేశారు. ఓవైపు వెంకటేశ్వర స్వామి..  మధ్యలో శంకరుడు ఆ పక్కనే కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఉంచారు. వెంకటేశ్వర స్వామి, శంకరుడితో పాటు ఆ తారక రామునికి కూడా పూజలు చేశారు.


కుల బల ప్రదర్శన ...
ఉమ్మడి రాష్ట్రంలో.. కమ్మవారు అంటే కష్టపడి ఎదిగే వారుగా.. సామాజిక సేవలో ముందుండే వారిగా.. అన్ని రంగాల్లోనూ తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న వారిగా గుర్తింపు ఉంది.  కానీ 2014 రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు కొంత మారిపోయాయి. కేవలం కమ్మ కులం అంటే ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమనే పరిస్థితి వచ్చింది. ఇక 2019  ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కేంద్రంగా తమ రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు కమ్మ కులం పై విషం చిమ్మారు. సుమారు 5 ఏళ్లపాటు ఇదే రీతిలో  అవమానాలు ఎదుర్కొంటూ కమ్మ సామాజిక వర్గం అంతా తమదైన రోజు కోసం ఎదురుచూసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టిడిపి అధికారంలోకి రావడం..  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో కమ్మ సామాజిక వర్గ ప్రజల్లో మునుపటి శక్తి వచ్చింది.


ఉండేది ఖమ్మం జిల్లా అయినా తమన ఎంతో ప్రభావితం చేసే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా గమనించే ఖమ్మం జిల్లా కమ్మవారు ఒక్కసారిగా తమ ఐక్యతను చాటేందుకు అన్నట్టుగా ఈ ఏడాది వనభోజనాలకు తరలివచ్చారు. ప్రతి ఏడాది గొల్లగూడెం రోడ్ లోని చెరుకూరు వారి మామిడి తోటలో జరిగే వనభోజనాలకు 20 నుంచి 30 వేల మంది హాజరవుతుంటారని అంచనా. కానీ ఈసారి వేదిక మార్చినప్పటికీ అనుహ్య రీతిలో 50 వేల మందికి పైగానే తరలి రావడం నిర్వాహకులనే ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ అంచనా ప్రకారం వనభోజనాలకు త్వరగా వచ్చిన కమ్మవారి సంఖ్య సుమారు 60 వేలకు పైనే ఉంటుందని ఓ అధికారి అనధికారికంగా చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా ఏడాది ఖమ్మం మహాజన వన సమారాధన కార్యక్రమం ఒక బల ప్రదర్శనగానే సాగింది అన్న చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: