ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు టీడీపీ గేట్లు మూసిందని అంటున్నారు. జనసేనలో మాత్రం అందరి నీ కాదు.. కొందరినే తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో వైసీపీ నుంచి బయటకు వచ్చేవారు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అయితే.. ఎవరు బయటకు వెళ్తున్నా.. ఎవరు లోపలికి వస్తున్నా.. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఎక్కడా పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం నాయకులు ఉండాలన్న ఫార్ములానే వాడుతున్నారు. దీంతో నాయకులు కూడా లైట్ తీసుకుంటున్నారు.
కానీ, ఎటొచ్చీ.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. ఒకే ఒక్క నేత విషయంలో జగన్ రెండు మెట్లు దిగి నిలబడ్డారని తెలుస్తోంది. ఆయనే మాజీ మంత్రి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో అనుభవం ఉన్న నాయ కుడు ధర్మాన ప్రసాదరావు. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఆయన మంత్రిగా చక్రం తిప్పారు. ఇలాంటి నాయకుడు.. ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయిం చుకున్నట్టు బలమైన ప్రచారమే జరుగుతోంది.
దీనికి ప్రధాన కారణం.. ఆయన తనయుడికి రాజకీయ ఫ్యూచరే. ఇలా ధర్మాన పార్టీ మారుతున్నారని, ఆదిశగా ఆయన ఆలోచన చేస్తున్నారని తెలిసి కూడా..జగన్‌ను ఆయనను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో నేరుగా కాకుండా.. పార్టీ పోస్టుతో కొడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని ఆయనకే వదిలి పెట్టారు. తీసుకుంటే మీరు, లేకపోతే.. మీరు చెప్పిన వారు.. ఎవరైనా ఓకే ఫైనల్ డెసిషన్ మాత్రం మీకే వదిలేస్తున్నాం.. అంటూ వైసీపీ అధినేత లేఖ సంధించారు.
ఈ పరిణామంపై ధర్మాన ప్రసాదరావు ఆలోచనలో పడ్డారు. వెళ్లిపోయే ముందు తన కాళ్లకు బంధం వేసే ప్రయత్నం చేస్తున్నారా ? అన్నది ఆయన చర్చ. దీంతో ఏమీ ఆలోచించకుండా.. తనదైన శైలిలో మౌనంగా ఉన్నారు. దీంతో వైసీపీ కూడా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టుగా ఇటు వైపు నుంచి కూడా మౌనంగా ఉంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.