వైసీపీ పాలనలో ఉన్నప్పుడు విఐపి బ్రేక్ సమయంలో చాలా అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ టైంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సెల్ఫ్ సిఫార్సు లేఖలు అధికారులకు సమర్పించి, వీఐపీ బ్రేక్ సమయంలో తమ వెంట 50 మంది, వందమందిని తీసుకొచ్చి శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఇలాంటి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడే రెండు మూడు రోజులు ఉండి దర్శనాలు చేసుకున్నట్లుగా కూడా అధికారులు ఆరోపించారు. వీరే స్వామి వారి దర్శనానికి రెండు మూడుసార్లు వెళ్లడం వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బంది కలిగిందని కూడా అన్నారు. అప్పట్లో 6 వేలకు పైగా విఐపి దర్శనం చేసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 3,400కు, అంటే సగానికి పైగా తగ్గింది. తద్వారా టీటీడీ, టీడీపీ కూటమి కలిసి భక్తుల సమయాన్ని సేవ్ చేశాయి.
అయితే ఈ దర్శనాల సంఖ్యలోనూ జరిగే అవకతవకలను గుర్తించి సరైన చర్యలు తీసుకుంటే భక్తులకు మరొక గంట అదనంగా దర్శన సమయాన్ని కల్పించవచ్చని టీటీడీ భావిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు రోజుకి ఒకటి నుంచి రెండు దాకా సిఫార్సు లేఖలు ఇవ్వవచ్చు. ఈ సిఫార్సు లేఖలు తీసుకొని శ్రీవారిని వీఐపీ బ్రేక్ లో సందర్శించవచ్చు. ఒకవేళ ఈ ప్రజా ప్రతినిధులు సెల్ఫ్ సిఫార్సు లేఖలతో వస్తే వారి లేఖపై పది మందిని దర్శనానికి అనుమతిస్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరైతేనే వారితో పాటు పదిమందిని అనుమతిస్తారు. ఆ పదిమందిలో కుటుంబ సభ్యులు బంధువులు ఉండొచ్చు. అయితే ఈ ప్రజాప్రతినిధులు ఒక్కసారి కాకుండా ఎక్కువసార్లు దర్శనాలకు వస్తున్నారని దీనివల్ల భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని టీటీడీ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.