బీజేపీ జాతీయ నాయకత్వం సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది. తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి ఎవరా అన్న దానిపై చర్చ జరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం భారీగానే ఆశావాహులు ఉన్నారు. దీంతో ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది.
డిసెంబర్ 10 నుంచి 20 వరకు మండల కమిటీలు పూర్తి చేయాలనే యోచనలో బీజేపీ భావిస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. ఈటల రాజేందర్ , రఘునందన్‌రావు, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లు అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలలో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీ వేదికగా లాబీయింగ్ చేపట్టినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అధ్యక్ష పీఠం అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఎంపీ ఈటల రాజేందర్‌కు అధ్యక్షపీఠం వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు. ఇటీవలే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డా అయిన మహబూబ్ నగర్ నుంచి గెలుపొంది మరీ రికార్డు సృష్టించారు. డీకే అరుణ కేంద్ర కేబినెట్‌లో చోటు కోసం లాబీయింగ్ సైతం చేశారనే టాక్ నడిచింది. . అయితే ఆశాభంగం కలిగింది. ఈ క్రమంలో చివరకు బీజేపీ చీఫ్ పదవి అయినా దక్కుతుందా అన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. డీకే అరుణకు సైతం సుదీర్ఘ రాజకీయ అనుభం ఉంది. ఈటల రాజేందర్‌కు ఏమాత్రం తీసిపోరు. ఈ క్రమంలో డీకే అరుణ బీజేపీ చీఫ్ రేసులో గట్టిపోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.