అదిగో పులి అంటే.. ఇదిగో తోక‌.. అనే ప్ర‌చారం రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా జ‌రుగుతుంది. అయితే.. కొన్ని కొన్ని సార్లు ఈ ప్ర‌చారం నిజ‌మేన‌ని కూడా తేలుతుంది. అలాంటిదే ఇప్పుడు ఒక ప్ర‌చారం తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిళానాయ‌కురాలు.. వాసిరెడ్డి ప‌ద్మ‌.. త్వ‌ర‌లోనే టీడీపీ పంచ‌న చేర‌నున్న‌ట్టు స్వ‌యంగా ప్ర‌క‌టించారు. వైసీపీలో ఇమ‌డ‌లేక‌.. జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌క‌..తాను బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని ఇంత‌కుమునుపే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


ఇక‌, తాజాగా కూడా మ‌రోసారి ఆమె అదే పాట పాడారు. ఓడిపోయినా.. జ‌గ‌న్ మార‌లేద‌ని వాసిరెడ్డి విమ‌ర్శ లు గుప్పించారు. ఇంత వ‌రకు బాగానే ఉంది.అయితే.. ఆమె టీడీపీలోకి ఎందుకు వ‌స్తున్నారు? ఊర‌క‌రా రు.. అన్న నానుడి ఉండ‌నే ఉంది క‌దా!సో.. ఏదో పెద్ద ప‌ద‌వికే ఎస‌రు పెట్ట‌బోతున్నార‌నే చ‌ర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. స‌హ‌జంగానే జంపింగులు ఇటీవ‌ల కాలంలో ముందే జాగ్ర‌త్త ప‌డుతున్నారు. వారికి కావాల్సిన ప‌దవుల విష‌యంలో ముందే చ‌ర్చించుకుని వ‌స్తున్నారు.


ఇలానే ఇప్పుడు వాసిరెడ్డి ప‌ద్మ కూడా.. ముందుగానే కీల‌క ప‌ద‌విని బుక్ చేసుకుని వ‌చ్చేస్తున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ప్ర‌స్తుతం కూట‌మిపార్టీల్లో అనేక ప‌ద‌వులు పంప‌కాలు జ‌రిగిపోయాయి. ఇక‌, మిగిలింది.. మ‌రో కీల‌క‌మైన ప‌ద‌వి.. మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి. వాస్త‌వానికి ఇది రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వి కావ‌డంతో కాలం ముగిసే వ‌ర‌కు వెయిట్ చేయాలి. అయితే.. ప్ర‌స్తుతం ఇది వైసీపీ నాయ‌కురాలి చేతిలో ఉంది.


దీనిని గ‌వ‌ర్న‌ర్‌కు మంత్రివ‌ర్గ తీర్మానంచేసి నోట్ పంప‌డం ద్వారా ర‌ద్దు చేయొచ్చు. ఇలా ర‌ద్దు చేసిన మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని వాసిరెడ్డి ప‌ద్మ‌కు ఇవ్వ‌నున్నార‌న్న‌ది ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌. పార్టీలో చేర‌కముందే.. ఆమె ఎమ్మెల్సీ కోరార‌ని, కానీ, కుద‌ర‌క‌పోవ‌డంతో ఒకింత‌ ప్రాధాన్యం ఉండడంత‌పాటు కేబినెట్ ర్యాంకు కూడా ఉన్న మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని ఆమె కోరుకున్న‌ట్టు త‌మ్ముళ్లు చెప్పుకొంటున్నారు.


దీనికి ఓకే అన్నాకే..ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చి.. దానికి స‌రిపోయే రీతిలో జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగార‌న్న‌దివారి టాక్‌. అయితే.. ఈ సీటును టీడీపీలోని చాలా మంది మ‌హిళా నాయ‌కులు ఆశిస్తున్నారు. అనంత‌పురం జిల్లాకు చెందిన యామినీ బాల నుంచి విజ‌య‌వాడ కు చెందిన ఓ మ‌హిళా నాయ‌కురాలి వ‌ర‌కు అంద‌రూ ఆశిస్తున్నారు. కానీ, ఇప్పుడు వాసిరెడ్డి రావ‌డంతో వీరంతా అంత‌ర్గ‌తంగా కుమిలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: