ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో త‌ల‌నొప్పి వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న నేరుగా.. చేసిన ఓ నియామ‌కం రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, వివాదాల‌కు దారితీసింది. అదే.. రాష్ట్ర నైతిక విలువ‌ల స‌ల‌హాదారుగా.. ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు నియామ‌కం. దీనిపై చంద్ర‌బాబు ఎవ‌రిని సంప్ర‌దించారో.. ఎవ‌రి సూచ‌న‌ల మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారో తెలియ‌దు కానీ.. చాగంటిని ఈ ప‌ద‌విలో నియ‌మించారు. అంతేకాదు.. కేబినెట్ మంత్రి హోదాను కూడా క‌ల్పించారు.


తొలినాళ్ల‌లో ఈ నియామ‌కం బాగానే ఉంద‌ని అంద‌రి నుంచి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. దీంతో చాగంటిని ప్ర‌త్యేకంగా రాజ‌ధానికి పిలిపించుకున్న చంద్ర‌బాబు.. ఆయ‌న‌కు బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. ఇక‌, నేడో రేపో చాగంటి ఈబాధ్య‌త‌లు తీసుకుని.. ప‌ని ప్రారంభించాల్సిఉంది. అయితే.. ఇంత‌లోనే పెద్ద మ‌లుపు తిరిగింది. చాగంటి నియామ‌కాన్ని వ్య‌తిరేకిస్తూ.. 100 మందికిపైగా మేధావులు సీఎం చంద్ర‌బాబుకు సుదీర్ఘ లేఖ రాశారు. దీనిలో అనేక అంశాల‌ను వారు ప్ర‌స్తావించారు.


విద్యార్థుల‌కు నేర్పాల్సింది.. రాజ్యాంగంలోని కీల‌కమైన అంశాలు.. స్వాతంత్ర ఉద్య‌మం, ప్ర‌జాస్వామ్యం, లౌకిక వాదం వంటివని పేర్కొన్నారు. అయితే.. చాగంటిని నియ‌మించ‌డం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పు చేసింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న కేవలం రామాయ‌ణం, భార‌తం వంటి పుక్కిటిపురాణాలు వ‌ల్లెవేస్తూ.. విద్యార్థుల‌ను పురాత‌న కాలంలోకి తీసుకువెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇలాంటివాటి వ‌ల్ల రాష్ట్రంలో అంట‌రానిత‌నం, ఎస్సీ, ఎస్టీల ప‌ట్ల ఏహ్య భావం పెరుగుతాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.


అంతేకాదు.. ఏ అర్హ‌త‌తో ఈ నియామ‌కం చేప‌ట్టార‌ని మేధావులు సీఎం చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. కేవలం రామాయ‌ణం చెప్ప‌డ‌మే అర్హ‌తా? అని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల‌కు, విద్యార్థుల‌కు ఇప్పుడు కావాల్సింది.. రామాయ‌ణ‌, భార‌తాలు కాద‌ని రాజ్యాంగ విలువ‌ల‌ని.. కాబ‌ట్టి.. నిష్ణాతులైన వారిని నియ‌మించాల‌ని వారు సూచించారు.


ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, జ‌న విజ్ఞాన వేదిక రాష్ట్ర నేత గేయానంద్ స‌హా.. అనేక మంది ఉద్ధండులైన ర‌చ‌యిత‌లు ఉద్య‌మ‌కారులు, విద్యావేత్త‌లు సైతం.. చాగంటిని వ్య‌తిరేకిస్తూ.. సీఎంకు రాసిన ఉత్త‌రంపై సంత‌కాలు చేయ‌డంగ‌మ‌నార్హం. దీనిపై చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. తాము కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని వారు హెచ్చ‌రించ‌డం విశేషం. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: