మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌నున్నారా? ఈ మేర‌కు అన్ని వ్యవ‌హారాలు రెడీ అయ్యా యా? అంటే.. ఔన‌నే అంటున్నారు జాతీయ మీడియా పెద్ద‌లు. దీనికి సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌..కేంద్రం పెద్ద‌ల‌ను ఒప్పించార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే చిరంజీవి రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్ట‌డం ఖాయ‌మ‌ని ప‌క్కా స‌మాచారం. అయితే.. ప్ర‌స్తుతం చిరంజీవి ఏ పార్టీలోనూ లేరు. దీంతో ఆయ‌న ను రాజ్య‌స‌భ‌కు పంపించ‌డం సాధ్య‌మేనా? అన్న‌ది ప్ర‌శ్న‌.


అయితే.. సాధ్య‌మేన‌ని అంటున్నాయి జాతీయ మీడియా వ‌ర్గాలు. కేంద్రంలోని బీజేపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల పెద్ద‌సాయ‌మే చేశారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఇలా.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన సెల‌బ్రిటీలు, ఇత‌ర పార్టీల వారికి బీజేపీ పెద్ద‌లు కొంత సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్  ఓ రాజ్య‌స‌భ సీటును త‌మ‌కు కేటాయించాల‌ని కోరిన‌ట్టు జాతీయ మీడియా పేర్కొంది. దీనికి బీజేపీ పెద్ద‌లు కూడా అంగీక‌రించారు.


వాస్త‌వానికి ఈ సీటును నాగ‌బాబుకు ఇవ్వాల‌ని తొలుత అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే మీడియా కూడా నాగ‌బాబు రాజ్య‌స‌భకు వెళ్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.  అయితే.. ఇంత‌లోనే ప‌వ‌న్‌కు.. పెద్ద‌న్న‌య్య గుర్తుకు రావ‌డం.. ఆయ‌న ప్రాతినిధ్యం ఉంటే.. బాగుంటుంద‌ని కుటుంబం కూడా భావించిన‌ట్టు జాతీయ మీడియా తెలిపింది. దీంతో ప‌వ‌న్ యూట‌ర్న్ తీసుకుని నాగ‌బాబును రాష్ట్రానికి ప‌రిమితం చేసి చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో సీటును రిజ‌ర్వ్ చేసుకున్నారు.


ఇక‌, ఇప్పుడు చిరుకు రాజ్య‌స‌భ సీటు ఇప్పించ‌డంలోనూ ఆయ‌న స‌క్సెస్ అయ్యార‌న్న‌ది జాతీయ మీడియా చెబుతున్న మాట‌. దీని ప్ర‌కారం.. ఆయ‌న ఏ పార్టీలోనూ లేక‌పోయినా.. రాష్ట్ర‌ప‌తి కోటాలో పెద్ద‌ల స‌భ‌కు వెళ్తార‌ని చెబుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల‌లోనే వీటిపై నిర్ణ‌యం రానుంది. దీనిలో భాగంగానే చిరుకు ఒక సీటును కేటాయించ‌డం ఖాయ‌మైంద‌ని.. జాతీయ మీడియా చెబుతోంది. సో.. చాలా కాలం త‌ర్వాత‌.. చిరు మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్ట‌డం ఖాయ‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: