తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులను టార్గెట్ చేస్తూ వస్తున్నారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. నటి హేమ అరెస్టు .. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం లో మోహన్ బాబును అరెస్టు చేస్తారన్న వార్తలు .. తాజాగా అల్లు అర్జున్ అరెస్టు గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి తర్వాత టార్గెట్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అని ఆయన ఇంటి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు మార్కింగ్ చేశారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రక్రియ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచే జరుగుతోంది. కె . బీ . ఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. చుట్టూ ఫ్లై ఓవర్లు నిర్మించడంతోపాటు రోడ్డు విస్తరించాలని చాలాకాలంగా అనుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనూ చర్చికి వచ్చాయి. ఎంత భూమి సేకరించాలో లెక్కలు కూడా బయటకు తీశారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక పనులు మరింత వేగవంతం అయ్యాయి.
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర కెబీఆర్ పార్కు వాకింగ్ ట్రాక్ కు ఎదురుగానే బాలకృష్ణ ఇల్లు ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో రెండు వైపులా ఉండే ఆ ఇంటికి సంబంధించి కొంత స్థలం కూడా రోడ్డు వెడల్పు లో పోతుంది. ఇంటి వరకు రాదు .. చట్టప్రకారం నష్ట పరిహారం తీసుకుని ఆ స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ ఎప్పుడో ప్రభుత్వానికి అంగీకార పత్రం కూడా ఇచ్చారని చెబుతున్నారు. ప్రతి గా ఆ స్థలంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పిందని తెలుస్తోంది. బాలకృష్ణ ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ లోనే రెండు ఇల్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి వేరే ఇంటికి మారాలని చాలాకాలంగా అనుకుంటున్నారు. ఇక్కడ వివాదం ఏమీ లేదు .. అయితే రేవంత్ రెడ్డి సర్కారు టాలీవుడ్ను వరుసగా టార్గెట్ చేస్తున్నట్టుగా కొందరు కలరింగ్ ఇవ్వటానికి ఇలా బాలకృష్ణ పేరు అనవసరంగా తెరమీదకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.