అల్లు అర్జున్ అరెస్టును చాలామంది ఖండించిన విషయం తెలిసిందే. అతన్ని జైలుకు కూడా పంపించారు. మధ్యంతర బెయిల్ వల్ల జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన బన్నీని కలిసేందుకు చాలామంది ప్రముఖులు వచ్చారు. అతన్ని కలిసి తమ మద్దతుని తెలియజేశారు. ఈ సమయంలో చాలామంది ప్రముఖులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు బన్నీ ఇంటికి వచ్చిన వేళ ఒకే దగ్గర కలుసుకున్నారు. వారిద్దరూ కలిసి నవ్వులు చిందించిన క్షణాలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసాయి.
ఆ ఇద్దరు నేతలు మరెవరో కాదు టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. వీరిద్దరూ ఒకే చోట నవ్వుతూ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇద్దరు నేతలు పాలిటిక్స్ పరంగా మొదటి నుంచి గురు శిష్యులుగా కనిపిస్తూ వస్తున్నారు. 2009లో భీమునిపట్నం నుంచి అవంతిని రాజకీయ రంగంలోకి దించింది శ్రీనివాస్ రావే కావడం విశేషం. అప్పటినుంచి 9 ఏళ్ల దాకా వారి పొలిటికల్ రిలేషన్‌షిప్ కొనసాగింది. గంటా, అవంతి ఇద్దరూ ఒకటే అన్న రీతిలో వారు ప్రవర్తించారు.
కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయాలని అవంతి భావించారు. అదే సీటు టికెట్ తనకూ కావాలని గంటా శ్రీనివాసరావు పట్టుపట్టారు. దాంతో అవంతి ఏకంగా టిడిపి నే వదిలేసి వైసిపి లోకి వెళ్లిపోయి భీమిలి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. గంటా శ్రీనివాస్ పైనే ఈ విజయం సాధించడం జరిగింది. అంతే, వారి మధ్య ఉన్న స్నేహం చెడింది.
కానీ ఇప్పుడు వైసీపీ పతనం అవ్వడంతో అవంతి శ్రీనివాసరావు టిడిపిలో జాయిన్ కావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే వైసిపి పదవులు అన్నిటికీ రాజీనామా ప్రకటించారు. కానీ టీడీపీ నేత గంట శ్రీనివాసరావు అవంతిని టీడీపీలోకి రావడం పట్ల అభ్యంతరం తెలుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు బన్నీ ఇంట్లో వారిద్దరూ కలిసి నవ్వుతూ కనిపించిన తీరు చూస్తుంటే ఈ గురు శిష్యులు చివరికి మళ్ళీ ఒకటవతారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.