ఏపీ సీసీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల‌.. సెంటిమెంటును న‌మ్ముకుంటున్నారు. కానీ, ప్ర‌జ‌లు ఆమె సెంటి మెంటు వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఆమె సెంటిమెంటు రాజ‌కీయాల దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌క‌మైన త‌మ బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య విష‌యాన్ని ష‌ర్మిల ప్ర‌ధానంగా తెర‌మీదికి తీసుకువ‌చ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌చారం చేశారు.


వివేకా హంత‌కుల‌ను జ‌గ‌న్ కాపాడుతున్నార‌ని ఆమెచెప్పుకొచ్చారు. ఈ సెంటిమెంటు త‌న‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ష‌ర్మిల విశ్వ‌సించారు. కానీ, జ‌గ‌న్ ను ఓడించేందుకు ఒకింత ఈ సెంటిమెంటు ఉప యోగ‌ప డి ఉంటుందేమో.. కానీ, ష‌ర్మిల గెలిచేందుకు కానీ..ఆమె ఓటుబ్యాంకును పెంచుకునేందుకు కానీ.. ఎక్క‌డా ఈ సెంటిమెంటు ప‌నిచేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ప్ర‌యోజ‌నం చేకూర్చ‌లేక పోయింది. దీంతో అప్ప‌ట్లో ప్ర‌యోగించిన సెంటిమెంటు ఏమాత్రం ప‌నిచేయ‌లేదు.


ఇక‌, ఇప్పుడు మ‌రోసారి సెంటిమెంటు అస్త్రాన్ని తీసుకువ‌చ్చారు ష‌ర్మిల‌. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తాన‌ని చెప్పిన ఆమె.. విభ‌జ‌న తాలూకు హామీల‌ను అస్త్రంగా చేసుకుంటాన‌ని కూడా సెల‌విచ్చారు. విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేస్తే.. రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందుతుంద‌ని.. కేంద్రం నుంచి ఉదారంగా నిధులు వ‌స్తాయ‌ని ఆమె చెబుతున్నారు. ఈ విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని కూడా.. సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి సుదీర్ఘ పోస్టు చేశారు.


అయితే..  ఈ సెంటిమెంటు కూడా.. ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది ప్ర‌శ్న‌గానే మారిపోయింది. దీనికి కార‌ణం.. ప్ర‌జ‌లు దాదాపు విభ‌జ‌న హామీల‌ను మ‌రిచిపోయారు. ఎవ‌రూపెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు. పోనీ.. తాము అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన రాహుల్ గాంధీ వైపు కూడా.. ఏపీ ప్ర‌జ‌లు మొగ్గు చూప‌లేదు. ఇక‌, ఈ ఏడాది ఎన్నికల్లో టీడీపీ కానీ, జ‌న‌సేన కానీ, విభ‌జ‌న హామీల‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. సో.. ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు విభ‌జ‌న హామీల‌తో ప‌నిలేకుండా పోయింది. కాబ‌ట్టి.. ష‌ర్మిల ఎత్తుకున్న విభ‌జ‌న సెంటిమెంటు ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: