శిథిలాలు మాట్లాడడం ఏంటనే ఆశ్చర్యం వేస్తుంది. కానీ, రెక్కలు ముక్కలు చేసుకుని సంపాయించుకున్న ప్రతిరూపాయినీ.. గూడు కోసం వెచ్చించిన సాధారణ జీవుల ఆశలను హైడ్రా చిదిమేసిన తర్వాత..మిగిలిన శిథిలాలను చూసుకుని.. బాధితులు పెడుతున్న కన్నీరుతో రాయి కూడా కదిలింది. సోషల్ మీడియాలో వీడియోల రూపంలో శిథిలాలు.. కదులుతున్నాయి.. మాట్లాడుతున్నాయి. ఇక్కడి వారి ఆవేదనను. బాధనుకళ్లకు కడుతున్నాయి. ఆక్రమణల పేరుతో చెరువును కొల్లగొట్టారంటూ హైడ్రా కూల్చిన ఇళ్ల తాలూకు శిథిలాలు.. మౌనంగా ప్రశ్నిస్తున్నాయి.
హైదరాబాద్ - పటాన్‌చెరు పరిధిలోని పటేల్‌గూడలో 3 నెలల క్రితం హైడ్రా కూల్చివేసిన ఇళ్ల శిథిలాలు ఇంతవరకు తొలగించ లేదు. కష్టపడి రూపాయి రూపాయి సంపాదించి కట్టుకున్న ఇల్లు కళ్ళముందే కూల్చేయడంతో ఏమీ చేయలేక బాధితులు ఈ శిథిలాలకు ఈఎంఐలు కడుతున్నారు. కష్టార్జితంతో కట్టుకున్న పేద, మధ్య తరగతి వారి ఇళ్లను కూల్చడమే కానీ ముఖ్యమంత్రి సోదరుడిది, చెరువుల్లో నిర్మించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాల జోలికి మాత్రం హైడ్రా వెళ్లడం లేదంటూ.. ప్రస్తుతం సదరు శిథిలాల వీడియోలను తీసి సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.
నిజానికి ఆక్రమణల చెరలో ఉన్న వాటిని గతంలో వైఎస్ హయాంలో రెగ్యులేషన్ యాక్ట్ తీసుకువచ్చి.. క్రమబద్ధీకరించారు. ఇది అప్పట్లో లక్షల మంది హైదరాబాద్ వాసులు వినియోగించుకున్నారు.కానీ, హైడ్రా పేరుతో రేవంత్ తీసుకువచ్చిన చట్టం.. దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల ఆశలను చిదిమేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నేడో రేపో.. మాజీ సీఎం కేసీఆర్.. బయటకు రానుండడం ప్రజల మధ్యకు వెళ్లనున్న నేపథ్యంలో ఇవన్నీ.. బీఆర్ ఎస్ కు కలిసి వస్తున్న రాజకీయ అస్త్రాలు.
వచ్చే ఏడాది రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ శిథిలాల వీడియోలు.. బాధితుల ఈఎంఐ కష్టాలు వర్ణనాతీతంగా ఉండడం గమనార్హం. దీనిపై రేవంత్ హుటాహుటిన స్పందించక పోతే.. చేసింది పుణ్యమని(మూసీ నదిని కాపాడుతున్నామని) ఆయన అనుకున్నా పాపమని ప్రజల మధ్యకు వెళ్లిపోయిన పరిస్థితి నుంచి ప్రభుత్వం తప్పించుకునే పరిస్థితి అయితే లేదు.