జాతీయ భద్రతా సలహాదారు "అజిత్ దోవల్" గురించి మీరు వినే ఉంటారు. 1945లో ఘర్వాలీ బ్రాహ్మణ కుటుంబంలో యునైటెడ్ ప్రావిన్సు (ప్రస్తుత ఉత్తరాఖండ్)కు చెందిన ఘర్వాల్ప ప్రాంతంలోని గిరి బనేల్సున్ గ్రామంలో పుట్టిన ఈయన ఒక రిటైర్డ్ ఐపీఎస్. భారత నిఘా, శాంతిభద్రతల అధికారిగా పనిచేసి, 2014 మే 30 నుంచి 5వ, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీకి తన సేవలను అందిస్తున్నారు. ఈయన 2004-05 కాలంలో ఇంటిలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్ గా కూడా పనిచేశారు. 1968 బ్యాచ్‌ కేరళ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి కూడా. 23 ఏళ్లకే ఈయన ఐపీఎస్‌కు ఎంపికయ్యి అప్పట్లో సంచలనం సృష్టించారు. తండ్రి సైన్యంలో పనిచేయడంతో అజ్మీర్‌లోని రాష్ట్రీయ మిలటరీ స్కూల్లో చదువుకున్నారు. ఆపైన ఆగ్రా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పీజీ చేశారు.

ఇక అసలు విషయంలోకి వెళితే... ప్రత్యేక ప్రతినిధుల చర్చల కోసం ఈయన త్వరలో చైనాకు వెళ్లనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ - చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి రెండు దేశాలు అక్టోబర్‌లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసినదే. ఆ తర్వాత అజిత్ దోవల్ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సరిహద్దు ఘర్షణల నివారణ, పెట్రోలింగ్, బఫర్ జోన్‌లకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్టు సమాచారం.

ఇకపోతే ఇటీవల పార్లమెంటులో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత్, చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ.. 2020లో చైనా తీరు కారణంగా సరిహద్దు సమస్య ఇబ్బందికరంగా మారిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల ఫలితాలు పరిస్థితులు సానుకూలంగా ఉండడం చాలా సంతోషకరం అని అన్నారు. ఇకపోతే భారత సరిహద్దు విషయంలో సైతం కీలకమైన పురోగతి ఉండనుందని ఊహాగానాలు వినబడుతున్నాయి. తద్వారా చైనాతో సంబంధాలు మెరుగుపడే అవకాశం లేకపోలేదు. న్యాయపరమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చర్చలకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: