తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేటీఆర్ అధ్యక్షతన ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కేటీఆర్ భారీ అవినీతికి పాల్పడినట్టు కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.


అయితే ఈక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ-కార్ రేసులో భారీ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీనిలో భాగంగానే కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు ఫైల్ పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం.


తాజాగా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ న్యాయ నిపుణుల సలహా తీసుకుని అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఫార్ములా-ఈ కార్‌ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు గవర్నర్‌ ఆమోదం లభించినట్లు అయింది.


కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కార్‌ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో, ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని ఎంఏయూడీ.. అక్టోబరులో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. తాజాగా గవర్నర్‌ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. సిఐడీ విచారణ జరిగితే కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. అయితే తన అరెస్ట్ విషయాన్ని ముందే గ్రహించిన కేటీఆర్, తాను ఏ కేసులకు భయపడేది లేదని.. అవసరమైతే అరెస్ట్‌ చేసుకున్నా పర్లేదని గతంలోనే ప్రకటించారు.



అయితే ఈ విషయమై ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు బాధ్యులపై చర్యలుంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారాలు అన్నీ చూస్తుంటే కేటీఆర్‌ అరెస్టు కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: