కేటీఆర్ ను ఫార్ములా- ఈ కార్ రేసులో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న రేవంత్ రెడ్డి మరో పెద్ద అడుగు వేయబోతున్నారు.  ఈసారి ఏకంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కేసులో బుక్ చేయనుంది.  బీఆర్ఎస్ పాలనలో చోటుచేసుకున్న విద్యుత్తు ఒప్పందాలపై మొదటినునంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే వాటినే లక్ష్యంగా చేసుకుంది.  ఇక కేసీఆర్ సర్కారు యాదాద్రి, భద్రాద్రి పేరిట విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం చేపట్టారు. అయితే, వీటిలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.  


తాజాగా జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. దీంతో విద్యుత్తు నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌, ఇతర పాత్రధారులపై చర్యలకు సర్కారు నిర్ణయించింది. అంతేగాక ఈ జస్టిస్ లోకూర్ నివేదికను శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని తీర్మానించింది.  అనంతరం కేసీఆర్‌ సహా పలువురిపై ప్రభుత్వం కేసు పెడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  


బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌ నిర్ణయాలు డిస్కమ్‌ లను ఆర్థికంగా కుప్పకూల్చాయని.. అయినా అధికారులు కేసీఆర్ మెప్పు కోసం తలూపారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా విద్యుత్తు కొనుగోళ్లు, పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో 25 ఏళ్లలో తెలంగాణ మూల్యం చెల్లించుకోనుందని తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ తో రూ.9 వేల కోట్ల దాకా ప్రజలపై భారం పడుతుందని తెలంగాణ క్యాబినెట్ పేర్కొంది. ఇక ఛత్తీస్ గఢ్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతో రూ.3,642 కోట్ల నష్టం జరిగిందని జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక తేల్చింది.


రేవంత్ ప్రభుత్వం వస్తూనే..  తెలంగాణలో విద్యుత్తు రంగంపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసింది. దీంతో విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు సవాల్‌ విసిరారు. మార్చి 14న జస్టిస్‌ ఎల్‌.నర్సింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్‌ ను ప్రభుత్వం నియమించింది.   సుప్రీం తీర్పుతో జస్టిస్‌ ఎల్.నర్సింహారెడ్డి తప్పుకొన్నారు. దీంతో జూలై 29న జస్టిస్‌ లోకూర్‌ కమిషన్‌ ను వేశారు. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లనుంది.


త్వరలో కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తారనే కథనాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు కేసు నమోదైతే ఎలా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: